సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం http://gramavolunteer. ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. గ్రామ వలంటీర్ల నియామకాల విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసి.. ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏస్థాయిలోనూ అవినీతికి తావులేకుండా చేసే ఉద్దేశంతో పాటు కులమత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసమే ప్రభుత్వం గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వలంటీర్ల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో నంబరు 104లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా గ్రామ వలంటీర్లను ఏ జిల్లాలో ఎంత మందిని నియమించాలన్నది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీలలో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.
స్థానికతే ప్రధాన అర్హత...
గ్రామ స్థానికతే వలంటీర్లుగా నియామకానికి ప్రాథమిక అర్హతగా ఉత్తర్వులో స్పష్టం చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు దరఖాస్తుకు కనీసం పదో తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు జూలై 11 నుంచి 25 తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వేతనాలకు ఏటా రూ.1,200 కోట్లు మంజూరు
రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లుగా నియమితులయ్యే వారికి నెలకు రూ. 5 వేల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఏటా రూ.1,200 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతున్నట్టు సీఎస్ ఉత్తర్వులో తెలిపారు. ఆగస్టు ఒకటి నాటికి రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును ఎంపికచేసి వారికి మండలాల వారీగా ఆగస్టు 5వ తేదీ నుంచి 10 వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం 15వ తేదీ నుంచి వారందరూ కేటాయించిన విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు
రాష్ట్ర స్థాయిలో వలంటీర్ల నియామక ప్రక్రియ పర్యవేక్షణకుగాను అధికారులతో రెండు కమిటీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నియమించారు. జిల్లాలో వలంటీర్ల ప్రక్రియ పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుధాకరరావు, కమిషనర్ ఓఎస్‌డీ దుర్గాప్రసాద్, స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏవో సాంబశివరావులతో కమిటీని నియమించారు. వలంటీర్ల నియామకంలో అధికారులకు తలెత్తే సందేహాలను ఈ కమిటీ నివృత్తి చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడితే జిల్లా అధికారులు వాటిని తెలియజేసిన వెంటనే పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖలో ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్‌టీజీఎస్‌లో పనిచేసే ముగ్గురు నిపుణులతో కలిపి మరో కమిటీని నియమించారు.
అర్బన్ వలంటీర్ల నియామకానికి శ్రీకారం
నవరత్నాల పథకాలను పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరవేయడానికి వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వలంటీర్‌ను నియమించనున్నారు. నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలను, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కోరింది. వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.5 వేల చొప్పున చెల్లించేందుకు ఏడాదికి రూ.486 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలి. వీరి ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http:// wardvolunteer.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ వలంటీర్లకు సంబంధించిన షరుతులే వీరికీ వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment