సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనావిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. కేవలం 16 రోజుల్లోనే దాదాపు 9 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వాలంటీర్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియెట్ విద్యార్హతగా నిర్ణయించినప్పటికీ.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్ కోర్సులు చదివినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. జూన్ 24వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. జులై 6వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ ద్వారా 9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి.
అందులో ఇప్పటికే 8,20,476 దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, సక్రమంగా ఉన్న 7,81,899 దరఖాస్తులను ఆమోదించారు. 79,580 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 38,577 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ అభ్యర్ధులు కూడా గడువులోపు తమ దరఖాస్తులు పొరపాట్లను సరిచేసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 24 లక్షల మందికి పైగా నెటిజన్లు వెబ్ సైట్ ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.
గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నిర్ణయించిన గడువు జూలై 5వ తేదీతో ముగిసింది. ఈ కొలువుల కోసం మొత్తం 7,92,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 7,49,878 మంది, గిరిజన ప్రాంతాల నుంచి 42,515 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉన్నత విద్యావంతుల నుంచి వేలల్లో దరఖాస్తులు
గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతులు సైతం పోటీ పడుతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఈ కొలువు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15,183 మంది, పట్టణ ప్రాంతాల్లో 6,532 మంది, గిరిజన ప్రాంతాల్లో 272 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. పట్టభద్రుల నుంచి కూడా భారీగానే దరఖాస్తులు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,08,410 మంది, గిరిజన ప్రాంతాల్లో 7,160 మంది పట్టభద్రులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు.
మహిళల నుంచి అనూహ్య స్పందన
గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం మహిళా అభ్యర్ధుల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొలువుల కోసం మొత్తం 4,02,245 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారు 3, 25,852 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 58,503 మంది, గిరిజన ప్రాంతాల నుంచి 17,890 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్హతల్లో సడలింపు
గ్రామ వార్డు వాలంటీర్ల నియామకాలకు సంబంధించి అర్హతల విషయంలో ప్రభుత్వం తాజాగా సడలింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల కోసం గతంలో విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియెట్‌కు తగ్గించారు.
గడువు పొడిగింపు
వార్డు వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తుది గడువును పొడిగించింది. ఈ నెల 5వ తేదీ దరఖాస్తులకు చివరి గడువుగా ముందు నిర్ణయించింది. అయితే వార్డు వాలంటీర్లకు విద్యార్హత డిగ్రీ నుంచి ఇంటర్మీడియెట్‌కు సడలించిన నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం తుది గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది.
పొరపాట్లు దిద్దుకోండిలా
అసంపూర్తి దరఖాస్తుల వల్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు తిరిగి తమ దరఖాస్తులను సరిగ్గా నింపి మరలా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment