సాధారణంగా పందెం కోళ్లకు కట్టే కత్తులు, ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నంలో శ్రీనివాసరావు ఉపయోగించిన విచ్చుకత్తి
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేసేందుకు వాడిన కత్తి విషయంలోనూ అత్యంత పకడ్బందీ వ్యూహం దాగిఉంది. అంతమొందించేందుకు ఎంచుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న వ్యక్తి, ఉపయోగించిన ఆయుధం... ఇలా అన్ని విషయాల్లోనూ అత్యంత పటిష్టమైన వ్యూహంతో జరిగినట్టు పోలీసు వర్గాల్లోనే చర్చసాగుతోంది. ఇది పక్కా ప్రొఫెషనల్స్ వ్యూహమని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కుట్రకు పథక రచన జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెల్సిందే. దానికి తగ్గట్టుగానే కోడి కత్తి రూపంలో మారణాయుధాన్నే తయారుచేయించారు. వాస్తవానికి కోడి కత్తి ముందు భాగంలో వెడల్పుగా పదునైన భాగం ఉంటే వెనుక మొన సూదిగా ఉంటుందని కోడి పుంజులకు కత్తులు తయారు చేసేవాళ్లు, కోడికి కత్తులు కట్టేవాళ్లు చెబుతున్నారు.
కానీ ప్రతిపక్షనేతపై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి ముందు పదునైన భాగం బాగా పొడవుగా ఉంది. దాన్ని పట్టుకోవడానికి బలంగా ఉండేలా వెనుక భాగం బలంగా పిడి మాదిరిగా ఉంది. చేతిలో బలంగా ఇమడటానికి వీలుగా తయారు చేయించారు. కచ్చితంగా ఇది కుట్రలో భాగంగానే కోడి కత్తి కంటే పదునుగా, బలంగా ఉండేలా తయారు చేయించిన విచ్చుకత్తి అని నేరవిచారణలో నిపుణులైన కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. హత్యాయత్నం జరిగిన క్షణంలోనే దుండగుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట అతని వద్ద ఒక కత్తే ఉందని, మూడవ రోజున తీరుబడిగా రెండవ కత్తి కూడా ఉందంటూ పోలీసులు చూపించారు. అంటే ఒక కత్తితో దాడి లక్ష్యం నెరవేరకపోతే మరో కత్తిని వాడేందుకు నిర్ణయించికున్నట్టు నిర్ధారణ అయ్యింది. నిందితుడు శ్రీనివాసరావు ఏకంగా రెండు కత్తులను పెట్టుకోవడం ప్రొఫెషనల్స్ వ్యూహమేనని క్రిమినల్ విచారణలో నిష్ణాతులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే చేశాడని జరుగుతున్న ప్రచారం నిజమన్నట్లుగా ఈ అంశాలు కుండబద్దలుగొట్టినట్లు చెబుతున్నాయి. ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని ఒకసారి, హత్యాయత్నం కాదు దాడి అని మరొకసారి, అసలు కత్తే లేదంటూ మరోసారి...ఇలా పొంతనలేని రకరకాల కట్టుకథలు వినిపిస్తున్న తీరు హత్యాయత్న కుట్ర వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది.
పక్కా వ్యూహంతోనే..
కుట్ర వెనుక ఉన్న ముఖ్యులు, సూత్రధారులు, అనేక రకాలుగా రెక్కీలు నిర్వహించిన ప్రొఫెషనల్ గ్యాంగులు... నిత్యం ప్రజల మధ్య ఉండే జగన్‌మోహన్‌రెడ్డిని తుదముట్టించడం తమవల్ల కాదని నిర్దారణకు వచ్చి, విమానాశ్రయాన్ని ఎంచుకున్న సంగతి తెల్సిందే. రద్దీ లేని వీఐపీ లాంజ్‌లో తమ పని చక్కబెట్టుకోవచ్చని భావించి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి జనుపల్లి శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. తెరవెనుక కథ నడిపారు. అనుమతులతో పనిలేకుండా శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోకి భారీ ఆయుధాలు తేవడం కంటే అత్యంత పదునైన చిన్నపాటి ఆయుధం తేవడాన్ని ఒక వ్యూహ ప్రకారమే ఎంచుకున్నారు. ప్లాన్ అమలులో ఏ పొరపాటు జరిగినా సూత్రధారుల పేర్లు, కుట్ర కోణం బైటపడకుండా కథ నడిపారు. ఎవరూ ఊహించలేని విధంగా హత్యకు కుట్రపన్నారని కొందరు న్యాయవిచారణ నిపుణులు చెబుతున్నారు.
కత్తి ఎక్కడ తయారు చేయించారో తేల్చని పోలీసులు..
నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును తిప్పుతున్న పోలీసులు హత్యచేయడానికి వాడిన ఆయుధాన్ని ఎక్కడ తయారు చేయించారో కనుక్కోలేకపోవడం నిఘూడ అంశంగా ఉంది. ఘటన జరిగి 23 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కత్తికి సంబంధించి పోలీసులు ఒక నిర్ధారణకు రాకపోవడం కేసును నీరుగార్చే యత్నంగా కనిపిస్తోంది. దర్యాప్తు చేపట్టిన తొలిరోజుల్లో ఆ కత్తి ఎక్కడ చేయించాడన్న దానిపై పోలీసులు కొంత హడావుడి చేశారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కోడి కత్తులు చేసే వారితో పోలీసులు ఆరా తీసారు. ఆ ప్రాంతాల్లో ఆ కత్తిని తయారు చేయించలేదని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లో కత్తి తయారు చేయించి ఆతరువాత విమానాశ్రయంలోకి చేర్చారు. ఇందుకు సెక్యూరిటీ అధికారుల సహకారంతో హర్షవర్దన్ చౌదని తన రెస్టారెంట్‌లో పనిచేసే సాకుతో శ్రీనివాసరావు, కత్తులను విమానాశ్రయంలోకి తరలించినట్లు కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా కత్తిని తయారు చేయించడంలోనే బలమైన కుట్ర దాగి ఉందనే విషయం తేట్టతెల్లమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment