
సాక్షి, కాకినాడ: ‘అంఫన్’ తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్ల కల్లోలంగా మారింది. తీరం వెంబడి కెరటాలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలు ఎగసిపడడంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మాయపట్నం వద్ద జియా ట్యూబ్ దాటుకుని ఇళ్ళల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. (‘అంఫన్’ ఎఫెక్ట్; ఎగసిపడుతున్న సముద్ర అలలు)
కాకినాడలోని సూరడపేట, మాయపట్నంలో కూడా సముద్రం కల్లోలంగా మారింది. జియో ట్యూబ్ దాటి ఊరిలోకి కెరటాలు ఎగసిపడుతున్నాయి. కెరటాల దాటికి జియో ట్యూబ్ రాళ్లు ఊళ్ళో వచ్చి పడుతున్నాయి. పూరి గుడిసెళ్ళోకి సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కాగా, అంఫన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు.