తాటిపూడి’లో షికారు చేస్తున్న పాత బోటు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు తాగునీటిని అందిస్తున్న తాటిపూడి జలాశయంలో స్పీడ్ బోట్లు షికారు చేయనున్నాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ రిజర్వాయరు పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ జలాశయంలో పర్యాటకుల విహారానికి కొన్నేళ్లుగా స్థానికులు 20 సీట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటారు బోట్లను నడుపుతున్నారు. వాటిని కొనుగోలు చేసి దాదాపు 15 ఏళ్లు దాటింది. అంతగా కండిషన్‌లో లేకపోయినప్పటికీ ఏదోలా వాటిని నడుపుతూ వచ్చారు. గత ఏడాది నవంబరులో కృష్ణా జిల్లా పవిత్ర సంగమంలో బోటు బోల్తా దుర్ఘటనలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో నదులు, జలాశయాల్లో కాలం చెల్లిన, కండిషన్ తప్పిన బోట్లను నిలుపుదల చేశారు. అందులోభాగంగానే తాటిపూడి రిజర్వాయరులో తిప్పుతున్న పాత బోట్లను కూడా ఆపేశారు. దాదాపు నాలుగు నెలలుగా అక్కడ బోటు షికారు జరగడం లేదు.
అరకు వెళ్లే, అటు నుంచి వచ్చే పర్యాటకులు ఈ రిజర్వాయరుకు వెళ్లి బోటులో ఎంజాయ్ చేస్తుంటారు. వారాంతపు రోజుల్లో (శని, ఆదివారాల్లో) సగటున 500 నుంచి 600 మంది వరకు పర్యాటకులు తాటిపూడి జలాశయంలో విహారానికి వెళ్లేవారు. తాటిపూడిలో బోటు షికారు నిలిచిపోవడంతో అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్కడ మూడు నాన్ ఏసీ, రెండు ఏసీ కాటేజీలు ఉన్నాయి. బోటు రైడింగ్ లేకపోవడంతో ఈ కాటేజీల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఫలితంగా పర్యాటకశాఖకు ఆదాయం క్షీణించింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్తగా స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి బోటు రైడింగ్‌ను పునరుద్ధరించాలని పర్యాటకశాఖ అధికారులు నిర్ణయించారు.
ఆరు సీట్ల సామర్థ్యం ఉన్న స్పీడ్ బోట్లు రెండు, 20 సీట్ల కెపాసిటీ గల ఒక బోటును కొనుగోలు చేయనున్నారు. ఆరు సీట్ల బోటు రూ.15 లక్షలు, 20 సీట్ల బోటుకు రూ.20 లక్షల చొప్పున వెచ్చించనున్నట్టు పర్యాటకశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. దాదాపు అరగంట సేపు లాహిరి లాహరికి ఒక్కొక్కరి నుంచి టిక్కెట్టు ధర రూ.50 వసూలు చేయనున్నారు. స్పీడ్ బోట్లు అందుబాటులోకి రావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. మోటారు బోటుకంటే స్పీడ్ బోటులో రైడింగ్ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మరో రూ.50 లక్షలతో పర్యాటక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటకశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment