మత్స్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న మరబోట్ల సంఘాల నాయకులు, మత్స్యకారులు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ప్రశాంతంగా ఉండే ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం విభేదాలతో భగ్గుమంటోంది. ఇప్పటి వరకూ కలిసికట్టుగా ఉన్న బోటు యజమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్పీడ్‌బోట్ల యజమానులు, చిన్న మర పడవల యజమానుల మధ్య చెలరేగిన చిచ్చు ఆరడం లేదు. రోజురోజుకూ అది దావానలంలా చేపల రేవును దహించేస్తోంది. చేపల రేవులో ప్రస్తుతం ఉన్న 700 బోట్లలో సుమారుగా 50 నుంచి 60 వరకూ స్పీడ్ ఇంజిన్ బోట్లు ఉన్నాయి. అధిక సామర్థ్యంతో నడుస్తున్న ఈ బోట్ల వల్ల తక్కువ సామర్థ్యం ఉన్న బోట్లకు నష్టం వాటిల్లుతోందని, స్పీడ్‌బోట్లను నిలిపివేయాలన్న డిమాండ్ చేపల రేవులో గట్టిగా వినిపిస్తోంది. అయితే తాము ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, స్పీడ్‌బోట్లను నడిపి తీరుతామని ఆయా బోట్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దీనిపై చిన్నబోట్ల యజమానులు నిరసనలు తెలియజేసినా, సమస్య కొలిక్కి రాకపోవడంతో సోమవారం ఫిషింగ్ హార్బర్ బంద్‌ను ప్రకటించడంతో పాటు మత్స్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వీరికి సంఘీభావంగా హార్బర్‌లో ఉన్న మూడు ప్రధాన మర పడవల సంఘాల అధ్యక్షులు ధర్నాలో కూర్చున్నారు. బంద్‌తో చేపల వేట నిలిచిపోయింది.
స్పీడ్ బోటు వెనుక దొరకని చేపలు
ఈ సందర్భంగా మరబోట్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ వేటకు వెళ్లే 15 మీటర్ల పొడవున్న మరబోటుకు 102, 112 హార్స్ పవర్ ఉన్న ఇంజిన్లను వినియోగిస్తే స్పీడ్ బోట్లలో చైనాకు చెందిన 200 నుంచి 250 హార్స్ వవర్ ఇంజిన్లు వినియోగిస్తున్నారని తెలిపారు. సాధారణ బోటు గంటలో ఒక కిలోమీటరు దూరం వెళ్తే, స్పీడ్ బోట్లు గంటకు మూడు కిలోమీటర్ల దూరం వెళ్తాయని, స్పీడ్ బోటు వెళ్లిన దారిలోనే మరపడవ వెళ్తే వారికి వేటలో ఏమీ చిక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ స్పీడ్ ఇంజిన్ బోట్లను రద్దు చేశారని చెప్పారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వం, మత్స్యశాఖ, జిల్లా అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఫిషింగ్ హార్బర్లో ఉన్న మూడు యూనియన్ల నాయకులతో పాటు చిన్నబోట్ల యజమానులు మత్స్యశాఖ అధికారులకు, ప్రభుత్వానికి వినతిపత్రాలను అందజేశారు. మరోవైపు దీనిపై తగిన నివేదిక పంపాలని మత్స్యశాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది. నిరసన కార్యక్రమంలో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్రి కొండబాబు, డాల్ఫిన్ మర పడవల సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి, మున్నం బాలాజీ, సనపల రవీంద్ర భరత్, మహా విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సంక్షేమ సమాఖ్య సమన్వయకర్త దూడ ధనరాజు, వై.శ్రీనివాసరావు, ప్రతినిధులు తోట సత్తిరాజు, మైలపల్లి లక్ష్మణరావు, దాసరి అప్పారావు, పీరుపల్లి ధన, అధిక సంఖ్యలో చిన్నబోటు యజమానులు పాల్గొన్నారు.
ఆగస్టు 15 నాటికి కార్యాచరణ
ఫిషింగ్ హార్బర్లో ఉన్న స్పీడ్ బోట్లను నిలిపివేయాలని ప్రభుత్వానికి విన్నవించామని యూనియన్‌ల నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌లను వినియోగించాలని ఆయా బోట్ల యజమానులకు తెలియజేశామని తెలిపారు. ఎవరికి వారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ నెల 15వ తేదీకి కార్యాచరణ రూపొందించి చిన్న బోట్ల యజమానులకు అన్యాయం జరగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని నాయకులు తెలిపారు.
ఆలోచింపజేసిన ఫ్లెక్సీ
వ్యవసాయదారుడు పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎలా ఆత్మహత్య చేసుకుంటున్నాడో అదేవిధంగా స్పీడ్ ఇంజిన్ బోట్ల వల్ల చిన్న బోట్ల యజమానులు కూడా ఆత్మహత్య చేసుకునే పరి స్థితి ఏర్పడుతుందంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని ఆలోచింపచేసింది. బోటు మాస్టర్ పోల్‌కు ఉరివేసుకుని వేలాడేలా ఉన్న ఫ్లెక్సీలను ఫిషింగ్ హార్బర్‌లో ఏర్పాటు చేశారు.
నిలిచిన రూ.6 కోట్ల వ్యాపారం
ఫిషింగ్ హార్బర్‌లో బంద్ ప్రకటించడంతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే నిలిచిపోయాయి. వేటకు వెళ్లిన బోట్లు కొన్ని తిరిగివచ్చినా అందులోని సరకును దించలేదు. హార్బర్‌లో ఉన్న దుకాణాలు, ఐస్ ఫ్యాక్టరీలు మూసేశారు. ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం నిలిచిపోయింది. రొయ్యల ఎగుమతి కేంద్రం మూతపడింది. మొత్తం మీద బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. సుమారుగా రూ.6 కోట్ల వ్యాపారం నిలిచిపోయినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment