డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం | Speed up of inquiry in Data theft case | Sakshi
Sakshi News home page

డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం

Published Mon, Mar 4 2019 3:46 AM | Last Updated on Mon, Mar 4 2019 2:08 PM

Speed up of inquiry in Data theft case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాల డేటాను చోరీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, విజిల్‌ బ్లోయెర్‌ లోకేశ్వర్‌రెడ్డిలు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో శనివారం సాయంత్రం వారు తనిఖీలు చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం విచారణకు రావాల్సిందిగా కంపెనీ సీఈఓ అశోక్‌కు నోటీసులిచ్చారు. కానీ, ఆయన హాజరుకాలేదు. ఆదివారం కూడా పోలీసులు మరోమారు తనిఖీలు చేశారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!)

రెండు రాష్ట్రాల డేటా తస్కరించారా?: కాగా, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల దగ్గర అత్యంత భద్రంగా ఉండాల్సిన డేటా బయటికి ఎలా లీక్‌ అయ్యింది.. ఎవరిచ్చారు అనే అంశంపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో టీడీపీతోపాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు ఏపీ ఓటరు లిస్టు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఎన్ని ఓట్లు తొలగించారు? ఎలా తొలగించారు? ఎంతమంది ఓట్లు గల్లంతయ్యాయి? ఎంతమంది ఆధార్‌ డేటాను సేకరించారు? అన్న విషయాలపైనా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ సీఈఓ అశోక్‌ లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని వారిద్దరూ ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. (ఐటీగ్రిడ్స్‌ స్కాం: అధికారుల్లో టెన్షన్‌.. టెన్షన్‌)

మరోవైపు.. ఆదివారం ఉదయం హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన అశోక్, పోలీసుల విచారణకు ఎందుకు రాలేదు? అన్న విషయం అంతుచిక్కడం లేదు. పోలీసులమని చెప్పుకుంటున్న వారు తన సిబ్బందిని తీసుకెళ్లారని ఆరోపిస్తున్న అశోక్‌.. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు.. విచారణకు రావాల్సిందిగా తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులనుఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లను డీకోడ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటిని డీకోడ్‌ చేస్తే డేటా చౌర్యంపై స్పష్టత రానుంది. (చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే)

ఆ నలుగురిని హాజరుపరచండి
ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, రెబ్బాల విక్రమ్‌గౌడ్‌లను సోమవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుపరచాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు డైరీని సైతం హైకోర్టు రిజిస్ట్రార్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. ఆ కేసు డైరీని భద్రపర్చాలని రిజిస్ట్రార్‌కు సూచించింది. ఇదే సమయంలో ఈ నలుగురిని పోలీసులే తీసుకెళ్లినట్లు, ఈ వివరాలను వారే పిటిషనర్‌కు తెలియచేసినట్లు వారి వారి తల్లిదండ్రులు లేదంటే భార్యలు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ డి.అశోక్‌ ఆదివారం అత్యవసరంగా హౌజ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. (ఐటీ గ్రిడ్‌ డేటా స్కామ్‌ సూత్రధారి బాబే)

‘ఐటీ గ్రిడ్స్‌’తో అల్లూరులో అలజడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటర్ల డేటా దుర్వినియోగమైందన్న వార్తలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో కలకలం సృష్టించాయి. ఈ దుర్వినియోగానికి పాల్పడిందన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ యజమాని డాకవరం అశోక్‌  స్వస్థలం అల్లూరు. మంత్రి లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సేవామిత్ర యాప్‌ను రూపొందించిన అశోక్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు డేటాను వాడుతున్నారన్న వార్తలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆశోక్‌ తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సహకారంతో సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌కు సన్నిహితుడిగా మారి అధికార పార్టీ కోసం తన కంపెనీ ద్వారా అడ్డగోలుగా పనిచేస్తున్నారన్న చర్చలు సాగుతున్నాయి.

కావలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్‌. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య ఉప్పు సాగుచేసే సాధారణ రైతు. అశోక్‌కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడటంతో బుజ్జయ్య టీడీపీలో చేరారు. ఇంజినీరింగ్‌ చదివిన అశోక్‌.. ఎన్నికలు, ఓట్లు, సర్వేల పట్ల రాజకీయ నాయకులకు ఉన్న ఆసక్తిని గమనించి ఆ రంగంలోకి దిగారు. బీద సోదరుల సహకారంతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు వివరించి వారికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే పదేళ్ల కిందట హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను ప్రారంభించాడు. ‘పార్టీ అనలిస్ట్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రజల్లో పార్టీల బలబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఈ క్రమంలో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను రూపొందించింది. ఆ యాప్‌తో టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లలో ఓటర్ల జాబితా ఉండేలా చేశారు. ఆ జాబితా ద్వారా ఆన్‌లైన్‌లోనే ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు చేసేలా కుట్రలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement