అనంతపురం జిల్లాలో కూరగాయలను ఎగుమతి చేసేందుకు అనుమతి పత్రాన్నిస్తున్న అధికారులు, అనంతపురం జిల్లా నుంచి అరటిని బెంగళూరుకు ఎగుమతి చేసేందుకు అనుమతి పత్రాన్నిస్తున్న ఉద్యాన అధికారి
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఎగుమతులకు మార్గం సుగమమైంది. రాష్ట్రం నుంచి ఏయే ప్రాంతాలకు పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయో గుర్తించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సీఎం సంప్రదింపులు జరపడంతో మంగళవారం నుంచి పెద్దఎత్తున పండ్లు, కూరగాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా..
► నిల్వ ఉంచితే పాడైపోయే పచ్చి సరుకును గుర్తించి ఉద్యాన శాఖాధికారులు రైతులకు వెంటవెంటనే పర్మిట్లు ఇప్పిస్తున్నారు.
► అలాగే, మార్కెటింగ్, రెవెన్యూ శాఖాధికారుల సహకారంతో త్వరితగతిన వాహనాలను ఏర్పాటుచేస్తున్నారు.
► ఫలితంగా ఉద్యాన పంటలు పొలం నుంచి వినియోగదారుల దరికి చేరుతున్నాయి.
► రాయలసీమ జిల్లాల నుంచి అరటి, బత్తాయి, పుచ్చ, టమాటా, ద్రాక్ష.. కోస్తా జిల్లాల నుంచి మామిడి, నిమ్మ, బొప్పాయితో పాటు ఇతర జిల్లాల నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు ఉద్యాన శాఖ తెలిపింది.
పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత
ఇదిలా ఉంటే.. దళారీ వ్యవస్థను రూపుమాపే క్రమంలో ప్రభుత్వం పండ్లు, కూరగాయల వంటి వాటి రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ చెప్పారు. అంతేకాక..
► అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డీఆర్‌డీఏ సహకారంతో పెద్దఎత్తున అరటిని ఎగుమతి చేశామన్నారు.
► నూజివీడు నుంచి మామిడిని, మదనపల్లె నుంచి టమాటాను, నెల్లూరు నుంచి పుచ్చ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అరటి తదితర పంటలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలించారు.
► ఇందుకు వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రెవెన్యూ శాఖ కూడా ఎంతో తోడ్పడుతోందని హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హనుమంతరావు వివరించారు.
► పర్మిట్లు ఇప్పించడంలో, వాహనాలను సమకూర్చడంలో, సరుకును ఏయే ప్రాంతాలకు పంపవచ్చో విశ్లేషించడంలో ఉద్యాన శాఖ గ్రామ సహాయకులు, ఏడీఓలు, జేడీలు, డీడీ స్థాయి అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు.
► కమిషనర్ చిరంజీవి చౌధురి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రైతుల ఇక్కట్లను తొలగించేలా సూచనలు ఇస్తున్నారన్నారు.
ఎక్కడికక్కడ మిర్చి కొనుగోళ్లు
కరోనా కేసులు వెలుగులోకి రావడం, రెడ్‌జోన్‌లో ఉన్న నేపథ్యంలో మిర్చి విక్రయాలను గుంటూరు యార్డుకు బదులుగా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుకు సగటున లక్ష టిక్కీల వరకు విక్రయాలు జరిగే గుంటూరు మార్కెట్ యార్డుకు రైతులు, వ్యాపారులు, హమాలీలు 10వేల మంది వస్తారు. భౌతిక దూరం పాటించే అవకాశాలు ఇక్కడ లేనందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
► రైతులకు ఇబ్బంది లేకుండా కోల్డు స్టోరేజి ప్లాంట్లు, జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులు, గ్రామాల్లో మిర్చి విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న వ్యాపారులు, ఎగుమతిదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
► రాష్ట్రంలో 410 కోల్డు స్టోరేజి ప్లాంట్లు ఉండగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 220 వరకు ఉన్నాయి. వీటితోపాటు జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో మిర్చి అమ్మకాలు చేపట్టనున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు అక్కడే కొనుగోళ్లు చేపడతారు.
► ప్రస్తుతం దాదాపు 80 వేల టిక్కీలు రైతుల వద్దనే ఉన్నాయి.
► గత నెల మూడో వారం నుంచి మిర్చి అమ్మకాలు జరగకపోయినా ధరలో మార్పు లేకపోవటం రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment