సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర సాధన కోసం.. నెల రోజులుగా సాగుతున్న ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోంది. లక్షల మంది రోడ్లపైకి వచ్చి సమైక్య స్ఫూర్తి చాటుతున్నారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ఎంతదాకానైనా పారాడేందుకు సిద్ధమేనన్న సంకేతాలను పాలకులకు పంపుతున్నారు. గత నెల 30న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన విషయం విదితమే. అప్పటి నుంచి ప్రారంభమైన ఉద్యమం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు, వృద్ధులు, చిన్నారులు.. అన్ని వర్గాలను కలిపింది. ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ తగిలేలా చేసింది.
జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులు శుక్రవారం స్థానిక బిర్లాగేట్ పూలే సర్కిల్‌లో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ముందుగా సంక్షేమభవన్ ఉద్యోగులతో కలిసి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద సామూహిక రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలుపడానికి వెళ్లిన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు చేదు అనుభవం ఎదురైంది. రాజీమానాలు ఆమోదించుకుని వచ్చాకే మాట్లాడాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సీమాంధ్ర నేతల చిత్రపటాలకు చీర, సారెలతో సీమంతం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఆదోనిలో రాజకీయ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు రోడెక్కి సమైక్య నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు పోస్టు కార్డులతో వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ దీక్షల్లో పాల్గొన్నారు. ముస్లీం, మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో చేపట్టిన 48 గంటల బంద్ మొదటి రోజు బంద్ విజయవంతం అయింది.
రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహరదీక్షలు జరిగాయి. ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. గాడిదలకు కేసీఆర్ మాస్క్‌ను ధరించి నిరసన వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల మండలంలో బెలుంగుహల సమీపంలో లారీ యాజమానుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు గుర్రాలపై స్వారీ చేస్తూ స్టేషన్ నుంచి బస్టాండు వరకు ర్యాలీ చేసి.. అనంతరం 18 మంది దీక్షలు చేపట్టారు. ఎమ్మిగనూరులో క్యాబర్సి శ్రీనివాసులు అనే వ్యక్తి సోమప్ప సర్కిల్‌లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్షకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వై.రుద్రగౌడ్‌లు సంఘీభావం తెలిపారు. నంద్యాలలో ఆర్టీసీ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పంచాయతీ రాజ్, విద్యుత్‌శాఖ, జేఏసీ, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో రహదారిపై విద్యార్థినులకు పాఠాలు బోధించారు.
సమైక్య స్ఫూర్తి
Published Sat, Aug 31 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement