కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీరలంకయ్య తమ జీవితాలతో ఆటాడుకున్నాడని పలువురు క్రీడాకారిణులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మందికి అన్యాయం చేశారని ఆరోపించారు.
విజయవాడ స్పోర్ట్స్: ‘తాను రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశా.. కబడ్డీ ఫెడరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ నిజమైనదేనంటూ ఇచ్చే ఫాం–2ని ఇవ్వమని కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీర్లలంకయ్యని ఫోన్‌లో అభ్యర్థించాను.. అందుకు రూ.లక్షలు డిమాండ్ చేశారు.. పైగా ‘నీకిస్తే నీ నుంచి నాకేంటి లాభం’ అంటూ ముక్తయించారని విశాఖపట్నంకు చెందిన క్రీడాకారిణి సునీత ఆరోపించారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్‌లో గురువారం కబడ్డీ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి వై.శ్రీకాంత్‌తో కలసి క్రీడాకారిణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సునీత మాట్లాడుతూ సర్టిఫికెట్ కోసం అక్కడికి, ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుందని అర్థమై, అర్థం కాని రీతిలో లైంగికంగా వేధించారని పేర్కొంది. అదేమని అడిగితే డైవర్ట్ చేసి మాట్లాడేవారని వివరించారు. తాను 15 నేషనల్స్ ఆడిన చివరకు ఫాం–2 అడిగితే నిరు పేదనైన నన్ను వీరలంకయ్య చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారిణిలు మాట్లాడుతూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వీర్లలంకయ్య సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు నాశనమం చేశారని చెప్పారు.
క్రీడాకారిణి హత్య వెనుక..
సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని నిలదీసిన కారణంగా 1995లో ప్రియదర్శిని అనే క్రీడాకారిణిని కారులో వీరలంకయ్య హత్య చేశారని ఆరోపించారు. వీరలంకయ్యను అసోసియేషన్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
20 ఏళ్లుగాకొనసాగడం నేరం
వీరలంకయ్య 20 ఏళ్లుగా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండడం నేరమని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆడినవారికి కాకుండా బయట వ్యక్తులకు కబడ్డీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని విలేకరులకు తెలిపారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కబడ్డీ క్రీడాకారిణులు ధనలక్ష్మి, సునీత, గౌతమి(విశాఖపట్నం), నవ్య, కేఎల్‌వీ రమణ(కృష్ణా) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment