జడివాన
నెల్లూరు(అర్బన్): ఎట్టకేలకు జిల్లా వాసులపై వరుణదేవుడు కరుణచూపించాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీవర్షం కురుస్తోంది. వాగులు, వంకలు జలకళను సంతరించుకుం టున్నాయి. చెరువుల్లో నీరు చేరుతోంది. మరోవైపు చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జిల్లా వ్యాప్తం గా 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోటలో 166 మిల్లీమీటర్లు (16 సెంటీమీటర్లు) వర్షం పడగా, నెల్లూరులో 110.6 మిల్లీమీటర్లు, కోవూరులో 142.4, గూడూరు 109.4, చిట్టమూరులో 105.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరులోని మాగుంటలేఅవుట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆత్మకూరుబస్టాండ్, మాగుంట లేఅవుట్‌లోని అండర్ బ్రిడ్జిల కింద మూడు వాహనాలు చిక్కుకుపోయాయి. ఇరుకళలపరమేశ్వరి ఆలయ ప్రాంతంలోని లోతట్టుకాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థ పడ్డారు. పలు పాఠశాలలకు సెలవు ఇచ్చేశారు.
నెల్లూరు జలమయం: కుంభవృష్టిగా కురిసిన వర్షంతో నెల్లూరు నగరం దాదాపు జలమయమైంది. రోడ్లపై వర్షపు నీరు పొంగిప్రవహించింది. ప్రధానంగా మాగుంట లేఅవుట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడి రోడ్లపై మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహిం చాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మాగుంట లే అవుట్ అండర్‌బ్రిడ్జి కింద నీళ్లు చేరడంతో ఓ కళాశాల బస్సు, మారుతీ కారు చిక్కుకుపోయాయి. నెల్లూరు ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఇక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రామలింగాపురంలో ఆగి ఉన్న వాహనంపై చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం త ప్పింది. ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద ఓ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాలను ఢీ కొంది. ఎస్2 థియేటర్స్ రోడ్డుపై నీరు భారీగా చేరింది.
ఈ ప్రాంతంలో దుకాణాల్లో చేరిన నీటిని తోడుకునేందుకు వ్యాపారులు అవస్థపడ్డారు. పొగతోట, బృందావనంలోనూ ఇదే పరిస్థితి. సండే మార్కెట్ వద్ద మోకాలి లోతున నీళ్లు నిలిపోయాయి. లీలామహల్ సెంటర్‌లలో డ్రైనైజీ నీళ్లు రోడ్డుపై పొంగి ప్రవహించాయి. కనకమహల్‌సెంటర్, పొదలకూరురోడ్డు, పద్మావతిసెంటర్, ద ర్గామిట్ట, బొల్లినేని హాస్పిటల్ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. ఆత్మకూరు బ స్టాండ్ అండర్‌బ్రిడ్జి వద్ద వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో పైపులపై ప్రమాదకరమైన స్థితిలో పాదచారులు నడవాల్సి వచ్చింది. రామలింగాపురంసెంటర్‌లో ఉన్న ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయాన్ని వర్షపునీరు చుట్టుముట్టాయి. కావలి, గూడూరు, వెంకటగిరి, చిట్టమూరు, డక్కిలి, కోవూరు తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
రైతులకు ఊరట : వర్షం కోసం ఆకాశం వైపు కళ్లు కాయలు కాసేలా చూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించింది. భారీ వర్షం కురవడంతో జిల్లాలోని అనేక చెరువుల్లోకి నీటి ప్రవాహం చేరుతోంది. నీళ్లు లేక ఎండుముఖం పడుతున్న నారుమళ్లకు ఈ వర్షం ప్రాణం పోసింది. జిల్లా వ్యాప్తంగా సేద్యం పనులను ముమ్మరం చేసేందుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు మెట్టప్రాంత రైతులకు కూడా ఈ వర్షం ఊరటనిచ్చింది.