ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద  | SR Constructions Sand Trafficking To Bangalore | Sakshi
Sakshi News home page

ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద 

Published Sat, Aug 3 2019 8:40 AM | Last Updated on Sat, Aug 3 2019 8:40 AM

SR Constructions Sand Trafficking To Bangalore - Sakshi

ప్రభుత్వ పనుల ముసుగులో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దందా చేస్తోంది. ఎక్కడ ఇసుక కనిపించినా అక్కడ వాలిపోతూ సరిహద్దులు దాటించేస్తోంది. కాంట్రాక్టు పనుల్లో లబ్ధిని పక్కనపెడితే.. ఆయా ప్రాంతాల్లోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి నేతల అండతో చెలరేగిపోయిన ఈ సంస్థ ఇప్పటికీ జిల్లా నలుమూలల నుంచి ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం
గమనార్హం. 


సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టు పనుల నిర్వహణ సంస్థగా జిల్లాకు సుపరిచితం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జిల్లాలోని విలువైన ఇసుక నిల్వలను కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. గత ఐదేళ్లుగా ఇదే తంతు. వాస్తవానికి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ సదరు సంస్థ దరఖాస్తు చేసుకుంది. పనులకు ఇబ్బంది లేకుండా ఐదు వాహనాల్లో ఇసుక తరలించుకునేందుకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు. అయితే, ఇందుకు భిన్నంగా అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ప్రతి రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. వాస్తవానికి ఇసుకను తీసుకోవాల్సిన ప్రాంతం బాల్‌రెడ్డిపల్లి. ఇక్కడి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుకను తరలిస్తూ.. మొదట భారీగా సొమ్ము చేసుకుంటోంది. ఈ విధంగా అక్రమ ఇసుకను అనుమతి లేని ట్రక్కు నుంచి తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇసుక దందా ఇలా.. 
ఎవరు: ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 
ఎక్కడ: శాసనకోట, పరిగి మండలం 
ఎలా: రోజూ 10 ట్రక్కుల్లో.. 
ఎంత: ట్రక్కు ఇసుక రూ.లక్ష 
ఎప్పటి నుంచి: మూడు నెలలుగా 
నెలసరి అక్రమార్జన: రూ.3 కోట్లు 

కళ్ల ముందు కనపడుతున్నా! 
జాతీయ రహదారి పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక తరలించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ నుంచి 6వ తేదీ జూలై 2019న లేఖ వెళ్లింది. ఇందుకు పరిగి తహసీల్దారు 31 జూలై 2019న రోజుకు 5 ట్రక్కుల ఇసుకను తరలించుకునేందుకు అనుమతిచ్చారు. ఆ మేరకు ఏపీ02టీహెచ్‌ 1600, 1603, 1612, 1602, 1604 నెంబర్లు కలిగిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు(ఆదివారం మినహాయించి) మాత్రమే. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. వాస్తవానికి ఎవరైనా పేదలు చిన్న చిన్న ట్రాక్టర్లల్లో ఇసుకను తరలిస్తే వాటిని సీజ్‌ చేసి కేసులు నమోదు చేసే అధికారులు.. కళ్ల ముందు భారీ ట్రక్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ ఎందుకు వాహనాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేయలేదనే చర్చ జరుగుతోంది. 

ఏదీ వాహనాల ట్రాకింగ్‌ 
వాస్తవానికి ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వొచ్చు. అయితే, అనుమతించిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ మాత్రం ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఏకంగా ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తోంది. అంతేకాకుండా అనుమతించిన వాహనాల్లో తరలించాల్సిన సందర్భాల్లో కూడా ఆ వాహనాలను గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాల రాకపోకలను రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తూ ఉండాలి. పగటి సమయాల్లో కాకుండా రాత్రి వేళ ఇసుకను తరలించకూడదు. అదేవిధంగా ఏ ప్రదేశం నుంచి ఇసుకను తీసుకెళుతున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారనే అనే వివరాలు కూడా జీపీఎస్‌ ద్వారా నమోదవుతుంటాయి. అయితే, ఇక్కడ మాత్రం ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. నిర్దేశించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాల్లో ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులను దాటిస్తోంది. మరోవైపు అనుమతించిన వాహనాలకు కూడా జీపీఎస్‌ పరికరాలు లేవు. దీంతో ఈ ఇసుక నిజంగా ప్రభుత్వ పనులకు తరలుతోందా? ఆ పేరుతో అక్రమంగా అమ్ముకుంటున్నారా అనే వివరాలు కూడా అధికారులకు చేరడం లేదు. అన్నింటినీ మించి నిర్దేశించిన ప్రాంతం నుంచి కాకుండా వేరే ప్రదేశం నుంచి.. అది కూడా ఇసుక రీచ్‌ కాని ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సదరు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుంటారా? మాముళ్ల మత్తులో జోగుతారా అనేది చూడాల్సి ఉంది.  

‘ఫిన్స్‌’తో నేరాలకు చెక్‌ 
అనంతపురం సెంట్రల్‌: నేరాలను నివారించడంతో పాటు నేరస్తులను తెలుసుకునేందుకు ఎస్పీ సత్యయేసుబాబు ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టం (ఫిన్స్‌) యాప్‌ను తీసుకొచ్చారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫిన్స్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మాట్లడుతూ... నేరాలకు అడ్డుకట్ట వేయడంలో  ‘ఫిన్స్‌’ యాప్‌ కీలకంగా మారుతుందని వెల్లడించారు. సుమారు 10 లక్షల మంది నేరస్తుల వేలి ముద్రలను డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. దీనికి అనుబంధంగా ట్యాబ్‌ ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పాత నేరస్తులు, రౌడీషీటర్లు తదితర వారిని గుర్తించే ఆస్కారముందన్నారు. ఈ యాప్‌ ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు వెరిఫై చేసి క్షణాల్లో అతను నేరస్తుడా... కాదా.. అని నిర్దారించుకునే వీలుంటుందన్నారు. వేలి ముద్రల ద్వారా నేరస్తులను గుర్తించే సిస్టం.. ఇప్పటికే ఉన్నప్పటికీ నేరస్తులను గుర్తించేందుకు చాలా సమయం పట్టేదన్నారు. అనంతరం ‘ఫిన్స్‌’ యాప్‌ను ఎలా వినియోగించాలో డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు చౌడేశ్వరి, ఎంవీఎస్‌స్వామి, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, మురళీధర్, సీఐలు, ఐటీ కోర్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement