
దిక్కుతోచని స్థితిలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు
హైదరాబాద్: పైలిన్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్లో మరో తుఫాను తాకిడికి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్ని కలగజేశాయి. జిల్లాలోని కవిటిలో అత్యధికంగా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మందస, కంచలిలో 17.1, పలాసలో 15.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నాగావళి, వంశధార నదుల్లో భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పాత పట్నంలో మహేంద్రతనయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఏడు మండలాల్లో అంధకారం నెలకొంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కూడా అకాల వర్షాలతో సతమతమవుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగుల్తూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. కొన్ని చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణ వీధుల్లో అనేక చోట్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ రోడ్, మెయిన్ రోడ్డు నీట మునిగాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం వీధుల్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు.