
సాక్షి, వైఎససార్ కడప : అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందమైనా.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అయినా వెనకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నీటితోపాటు రాజధాని లేదా హైకోర్టు అవసరమని తేల్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దేవినేని ఉమా వంటి వారు రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడంపై వ్యతిరేకించారన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులను దేవుళ్లుగా చూస్తుంటే ప్రతిపక్షాలు పెయిడ్ ఆర్టిస్టులతో రైతుల అవతారం ఎత్తి అభాసుపాలైందని విమర్శించారు. రాజధానిపై కమిటీల నివేదికలు పూర్తి స్థాయిలో రాగానే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ లోపే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెళ్లిన నాయకులను చూశాం కానీ ఒకటి కాదు రెండు స్టీల్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment