నిజాయితీ కలిగిన మేధావులకే ఓటు వేయాలి
► ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటిటౌన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి నిజాయితీతో పాటు మంచి మేధావిగా కూడా తనకు పరిచయం ఉందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సాక్షితో ఫోన్ లో మాట్లాడారు. త్వరలో జరగున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని అన్నారు. నిజాయితీతో కూడిన మేధావులకు ఓటు వేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘనేతగా, శాసన మండలి సభ్యుడిగా, విద్యాక్షేత్రాల శ్రేయస్సు కోరే వ్యక్తిగా తనకు పరిచయం ఉందన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై అధికారులతో, ప్రభుత్వ పాలకులతో నిర్భయంగా మాట్లాడగలరని అన్నారు.
గతంలో పోచంరెడ్డి సుబ్బారెడ్డి శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తను ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ వర్గానికి సంబధించి 172 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించి జవాబులు రాబట్టిన ఘనత ఆయన సొంతమన్నారు. అప్పటి ప్రభుత్వం ఆయనకు యునిసెఫ్ అవార్డును ప్రదానం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే నైజం ఆయన సొంతమన్నారు.
శాసన మండలి సభ్యుడిగా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అప్రెంటీస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటీస్ రద్దు చేయించడానికి కృషి చేశారని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తుల్లో సుబ్బారెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు. మేధావి వర్గమైన ఉపాధ్యాయులు అందరూ పోచం రెడ్డి సుబ్బారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.