గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి : టీడీపీలో త్వరలో చీలిక రాబోతుందని, ఆ ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వయసు మీరిన నేతలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చీలిపోతుందనే ఆందోళనతో ఏమి మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్ధం కావడంలేదని, ఎల్లో మీడియా కూడా చంద్రబాబును మోసి మోసి అలిసిపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదని అన్నారు. పోలీసుల మీద ఆధారపడి జీవించేది చంద్రబాబు.. జెడ్ ప్లస్ భద్రత లేకుండా జనాల్లోకి ఆయన వెళ్లగలరా అంటూ ప్రశ్నించారు.
వికేంద్రీకరణ ఎందుకు వద్దో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రాయలసీమలో రౌడీలు ఉన్నారని విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు కీయా పోతుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధపు వార్తలు రాయించి సంతోషం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు చెప్పినట్లు రాసే పత్రికలు ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
‘చంద్రబాబు బతుకు గ్రాఫిక్ బతుకు.. సీఎం వైఎస్ జగన్ చేసే మంచి పనులు చూడలేక బురద జల్లుతున్నారు.. బాబు ఒక గూండాలా మాట్లాడుతున్నారు. ఆయనకు దమ్ముంటే తనతో చర్చకు రావాలి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవసరం లేదు. వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని చైర్మన్ స్వయంగా చెప్పారు. రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టిన గొల్లపల్లి ప్రాజెక్టు వల్లనే కీయా పరిశ్రమ అనంతపురంకు వచ్చింది. చంద్రబాబునాయుడు కియాపై తప్పుడు కథనాలు రాయించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయే కానీ పోయేవి ఉండవు.
చంద్రబాబును చూసి సిగ్గు పడుతున్నా. ఆయనకు దమ్ముంటే రైతులను ఎవరు మోసం చేస్తున్నారో తమతో చర్చకు తుళ్లూరుకు రావాలి. వైఎస్సార్ సీపీ తరపున నేను వస్తా. వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారో చెప్పగలరా. గంటలు గంటలు లెక్చర్ ఇవ్వడం కాదు, ప్రజలకు మేలు చేయాలనే బుద్ది ఉండాలి. చంద్రబాబుకు నగరాలు నిర్మించే సామర్థ్యం ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు చెయ్యలేదు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. టీడీపీ హయాంలో 3 లక్షల కోట్లు దిగమింగారు. చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారు’’ అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment