ఆ 4 వాక్యాల కోసం..పెద్దల  ‘షో’ | Srinivas Huge drama with the support of Police deparment | Sakshi
Sakshi News home page

ఆ 4 వాక్యాల కోసం..పెద్దల  ‘షో’

Published Wed, Oct 31 2018 3:55 AM | Last Updated on Wed, Oct 31 2018 9:30 AM

Srinivas Huge drama with the support of Police deparment - Sakshi

మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు శ్రీనివాసరావు

విశాఖ నుంచి సాక్షి ప్రతినిధులు: అంతా ఊహించిందే జరుగుతోంది. ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ  నిర్వహిస్తున్నారు. ఆది నుంచి బిగిసడలని సన్నివేశాలతో రక్తి కట్టిస్తున్న  డ్రామా మంగళవారం పతాకస్థాయికి చేరింది. ‘నేను జగన్‌ అభిమానిని..  ప్రజల కోసమే ఇదంతా చేశా’ అంటూ నిందితుడు శ్రీనివాస్‌తో పరిమిత స్థాయిలో వాక్యాలను పోలీసులు పలికించారు. ఈ డ్రామా ముగింపులో ‘మీకు కావాల్సిన బైట్‌(విషయం) వచ్చింది కదా’ అంటూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌ సీఐ మళ్ల శేషు ఎల్లో మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం! వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణలో భాగంగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్‌ మంగళవారం గుండె దడగా ఉందని చెప్పారని పోలీసులు ప్రైవేటు వైద్యుడిని పిలిపించారు. శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ దేవుడు బాబు..అతని ఆరోగ్యం బాగుందని వెల్లడించారు.

కథ నడిపిన పోలీసులు...
ఆరోగ్యం బాగుందని డాక్టర్‌ చెప్పినా మళ్లీ వైద్య పరీక్షల కోసం నిందితుడు శ్రీనివాస్‌ను సాయంత్రం కేజీహెచ్‌(కింగ్‌ జార్జ్‌ హాస్సిటల్‌)కు తరలించారు. విచారణను అత్యంత గోప్యంగా చేస్తున్న పోలీసులు నిందితుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండటంపై మాత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌ నుంచి కేజీహెచ్‌కు 11 కిమీల దూరం ఉంటుంది. సాయంత్రం 3.40 నుంచి 4 గంటల మధ్య పెద్దగా ట్రాఫిక్‌ ఉండదు. సుమో లేదా కారు వంటి వాహనాల్లో కేవలం పది లేదా 15 నిమిషాల్లోనే కేజీహెచ్‌కు చేరుకోవచ్చు. కానీ.. మీడియా కేజీహెచ్‌కు చేరుకోవడానికి వీలుగా పోలీసులు కావాలనే నింపాదిగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేవలం పావు గంట లేదా 20 నిమిషాల్లోపే కేజీహెచ్‌కు చేరుకోవాల్సిన పోలీసు వాహనం 40(ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌ నుంచి 3.40 గంటలకు ప్రాంభమై.. కేజీహెచ్‌కు 4.20 గంటలకు చేరుకున్నారు) నిమిషాలకు చేరుకుంది. 

మీడియాకు వినిపించడానికే...
కేజీహెచ్‌ ఆసుపత్రి ప్రాంగణంలో వాహనం నుంచి దించిన వెంటనే.. ‘నాకు ప్రాణహాని ఉంది సర్‌.. ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి’ అని శ్రీనివాస్‌ అడగడం విన్పించింది. శ్రీనివాస్‌ను నేరుగా క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లి.. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సురేంద్రబాబుకు చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ‘ఆరోగ్యం బాగుంది.. పరీక్షలు అవసరం లేదు.. వైద్యమూ అవసరం లేదు’ అని వైద్యలు పోలీసులకు సూచించారు. కానీ.. పోలీసులు క్యాజువాలిటీ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న ఎమర్జీన్సి మెడిసిన్‌ విభాగానికి వీల్‌ ఛైర్‌లో శ్రీనివాస్‌ను తీసుకెళ్లారు. శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు చెప్పించడానికి వీలుగా.. 30 మీటర్ల దూరంలో ఐదు సార్లు అటు ఇటు తిప్పారు. ఈ సమయంలో మీడియాతో శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘నేను జగన్‌ అభిమాని’ అని ఒకే వాక్యం చెప్పగలిగాడు. దీంతో పోలీసులు తృప్తి పడలేదు. కాస్త స్పష్టంగా ఆ నాలుగు వాక్యాలు చెప్పించడానికి వీలుగా క్యాజువాలిటీ వార్డు నుంచి కాస్త విశాలమైన రోడ్డు గుండా కార్డియాలజీ విభాగానికి తీసుకెళ్లే సమయంలో శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు స్పష్టంగా చెప్పించారు. ‘నేను జగన్‌ అభిమానిని.. ప్రజల కోసమే ఇదంతా చేశా. నా వెనక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేసేందుకు చూస్తున్నారు. నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండి’ అంటూ శ్రీనివాస్‌తో మీడియాకు చెప్పించారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఆసుపత్రికి డీలాగా.. పోలీసు స్టేషన్‌లోకి హుషారుగా:
నిందితుడు శ్రీనివాస్‌ ఆరోగ్యం బాగుందని డాక్టర్‌ దేవుడు బాబు తేల్చి చెప్పాక.. అతన్ని మళ్లీ వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించాల్సిన అవసరం లేదు. కానీ.. మీడియాకు ఆ నాలుగు వాక్యాలను చెప్పించడం కోసం వేసిన స్కెచ్‌లో భాగంగానే సాయంత్రం నిందితుడిని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకున్నాక డీలాగా ఉన్నట్ల నటిస్తున్న శ్రీనివాస్‌ను వీల్‌ ఛైర్‌పై ఆసుపత్రిలోకి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శ్రీనివాస్‌ను పోలీసు వాహనంలో కేజీహెచ్‌ నుంచి సాయంత్రం 6.07 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు 6.28 గంటలకు తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నా కేజీహెచ్‌ నుంచి కేవలం 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వాహనం నుంచి దిగిన శ్రీనివాస్‌ హుషారుగా పోలీసు స్టేషన్‌లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిని పరిశీలిస్తే.. కేవలం మీడియాకు ఆ నాలుగు వాక్యాలు చెప్పించడం కోసమే ఈ డ్రామాను పోలీసులు నడిపినట్లు స్పష్టమవుతోంది. 

మీడియాతో నేరుగా మాట్లాడించకుండా..
మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని నేరుగా మాట్లాడించడానికి పోలీసులకు అవకాశం ఉంది. అలా చేస్తే.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడే అవకాశం ఉందని... హత్యకు కుట్ర చేసిన తమ బండారం బయపటడుతుందని స్క్రిప్టు రాసిన పెద్దలు భయపడ్డారు. ప్రతిపక్షనేతను హతమార్చడానికి కర్కశంగా దాడిచేయడం వెనక ఉన్న సూత్రధారుల గుట్టు రట్టవుతుందనే భయంతో... తాము చెప్పించాల్సిన ఆ నాలుగు వాక్యాలను చెప్పిండచానికి మాత్రమే ఈ హైడ్రామా నడిపినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పెద్దల స్క్రిప్ట్‌ మేరకే ...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్ట్‌ మేరకే నీరుగార్చుతున్నారు. ప్రతిపక్ష నేతపై గురువారం హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే దాడి చేశారు.. ఇదో చిన్న సంఘటన’ అంటూ విచారణను ఆదిలోనే తేల్చేశారు. అనంతరం గురువారం రాత్రి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘వాళ్లపై వాళ్ల అభిమానే దాడి చేశారు.. సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవడానికే ఇలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచి.. అల్లర్లు సష్టించి, రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్‌ గరుడలో భాగంగానే కేంద్రం ఈ దాడులు చేస్తోంది’ అంటూ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు విచారణ ఏ స్థాయిలో జగరబోతోందో చెప్పకనే చెప్పేశారు. గత ఆరు రోజులుగా ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే కేసు విచారణ చేస్తున్న పోలీసులు.. డ్రామాను పతాకస్థాయికి తీసుకెళ్లడానికి సోమవారం రాత్రి పూనుకున్నట్లు పోలీసు వర్గాలే వెల్లడించాయి.

‘‘సోమవారం అర్ధరాత్రి ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న విమానాశ్రయంలోని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌.. ‘శ్రీనివాస్‌ను మీడియా ముందుకు తీసుకెళ్తే అసలు విషయాన్ని బయటపెట్టేస్తాడు. కేసు విచారణ ముగుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఆ మేరకు మంగళవారం పోలీసులు ఈ హైడ్రామా నడిపి.. సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టు కాకుండా.. కేసు విచారణను నీరుగార్చేశారనే’’ అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement