సిద్ధమవుతున్న క్యూలైన్లు
కర్నూలు, శ్రీశైలం: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి మార్చి 6 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదిమహాశివరాత్రి పర్వదినం శివునికి అత్యంతప్రీతికరమైనసోమవారం (మార్చి 4) రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి వసతి తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే శాశ్వత ప్రాతిపదికన క్షేత్రవ్యాప్తంగా 300 వరకు మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి అదనంగా 200 టాయిలెట్లను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. నాగలూటి, దోర్నాలలో సైతం 20 చొప్పున తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈ రామిరెడ్డి తెలిపారు. అలాగే క్షేత్రవ్యాప్తంగా 500 మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యాన వనాలు, యాత్రికులు సేదతీరే ప్రదేశాల వద్ద నిరంతరం
మంచినీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
భక్తులకు సౌకర్యవంతంగా క్యూలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా ఉచిత, అతిశీఘ్ర దర్శన క్యూలతో పాటు శివదీక్షా స్వాముల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. శివస్వాముల కోసం చంద్రవతి కల్యామండపం నుంచి శివాజీగోపురం ఎదురుగా ఉన్న భ్రామరి ఉద్యానవన క్యూ ద్వారా ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. క్యూలలో ఉచితంగా పాలు, మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేయడానికి దాతల సహకారాన్ని తీసుకుంటున్నారు. పాతాళగంగ మొదలుకొని క్షేత్రవ్యాప్తంగా పారిశుద్ధ్య లోటు రాకుండా దేవస్థానం శానిటేషన్ విభాగంతో పాటూ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు అవడం వల్ల ఈ సారి పార్కింగ్ ప్రదేశాల సంఖ్య పెరిగింది. యజ్ఞవాటిక వద్ద గతంలో ఉండే బస్ పార్కింగ్ బదులు కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి పై భాగంలో చదును చేసి బస్సు పార్కింగ్‌కు కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా మరొక బస్ పార్కింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఏటా రాత్రి పూట విద్యుత్ వెలుగుల కోసం అత్యధికంగా టవర్‌లైట్లను వినియోగించేవారు. ఈసారి అవుటర్‌రింగ్ రోడ్డు మొత్తం లైటింగ్ వ్యవస్థ ఉన్నందున వాటి సంఖ్య తగ్గించి అవసరమైన 10 ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్రం ప్రసాద పథకం కింద అదనపు ఏర్పాట్లు
కేంద్ర ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి ప్రసాద పథకం కింద పర్యాటక శాఖ ద్వారా నిధులు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది శిఖరేశ్వరం, కర్ణాటక సత్రం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులు శివరాత్రిలోగా పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు. పాతాళగంగ వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఈ పథకం ద్వారా చేపట్టారు. గర్భిణులు, చంటిపిల్లల తల్లులకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం విడతల వారీగా జరిగేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. వివిధ ప్రదేశాలలో వైద్యశిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పుడున్న 108 వాహనానికి ఆదనంగా మరికొన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఘాటు రోడ్డులో వాహనాలు అగిపోతే ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు క్రేన్‌లను శ్రీశైలం–దోర్నాల, అలాగే మున్ననూరు నుంచి శ్రీశైలం వరకు అందుబాటులో ఉంచనున్నారు.
లడ్డూ ప్రసాదానికి లోటు రానివ్వం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 10 లక్షలకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. వారికి మల్లన్న లడ్డూప్రసాదం కొరత రాకుండా ఈ ఏడాది 40 లక్షల లడ్డూలను తయారు చేయించనున్నాం. గత ఏడాది 30 లక్షలకు పైగా తయారు చేసి,భక్తులకు అందించాం. ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 10 లక్షల లడ్డూలను చేయిస్తున్నాం. లడ్డూ విక్రయాలకు మొత్తం 16 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీరామచంద్రమూర్తి, ఈఓ
Comments
Please login to add a commentAdd a comment