
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్శిక బ్రహ్మోత్సవాలకు వసంత మండపంలో ఆదివారం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులోభాగంగా విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో భూమిపూజతో మట్టిని సేకరించి ఛత్ర, చామర మంగళవాయిద్యాలతో మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాలికల్లో శాలి, వ్రహి, యవ, మద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలతో అంకురార్పణ చేశారు.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7 గంటలలోపు మీనలగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 8గంటలకు పెదశేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈవో సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తిరుమల రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment