నిద్రావస్థలో ఎస్‌ఎస్‌ఏ! | SSA dormant! | Sakshi
Sakshi News home page

నిద్రావస్థలో ఎస్‌ఎస్‌ఏ!

Published Sat, Dec 27 2014 3:28 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

SSA dormant!

అనంతపురం ఎడ్యుకేషన్ : నిధులు పుష్కలంగా ఉన్న శాఖల్లో సర్వశిక్ష అభియాన్ ఒకటి. ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ పరిస్థితి. పర్యవేక్షణ లేకపోవడంతో నిద్రావస్థలో ఉంది. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది నెలలుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ లేరు. పీఏ పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సెక్టోరియల్ ఆఫీసర్లు, కార్యాలయంలో సిబ్బంది ఎవరికి వారే.. యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. నిధులు దండిగా ఉన్నా వాటిని ఖర్చు చేయించే అధికారి లేకపోవడంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతోంది. విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
   
 రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు
 2014-15 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఖర్చు చేసేందుకు రూ. 202 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వీటిలో రూ.83 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏడు నెలలు గడిచినా కేవలం రూ. 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే ఈ శాఖ పర్యవేక్షణ ఎంత మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో కూడా పాఠశాల నిధులు, పాఠశాల అభివృద్ధి నిధులు, ఎమ్మార్సీ, కాంప్లెక్స్ నిధు లు సుమారు రూ. 6 కోట్లు ఎస్‌ఎస్‌ఏ నుంచి ఆయా ఖాతాల్లో జమ చేశారు.
 
  ఈ రూ.6 కోట్లు ఎస్‌ఎస్‌ఏ లెక్కలో ఖర్చు చేసినట్లే. కానీ ఈ నిధు ల్లో కూడా కనీసం రూ. రెండు కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఇంకా నాలుగు కోట్లు ఆయా ఖాతాల్లో మూలుగుతున్నాయి. ఈ లెక్కన ఖర్చు చేసింది కేవలం రూ.35 కోట్లే. వచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే తర్వాత క్వార్టర్‌లో నిధుల విడుదలలో కోత విధిస్తారు. ఇప్పుడు ఖర్చు చేసిన నిధుల ఆధారంగా నిధులు తగ్గించి విడుదల చేస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వచ్చే నిధుల్లో భారీగా కోతపడడం ఖాయమని ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది చెబుతున్నారు.  
 
 అంతంతమాత్రంగానే కార్యక్రమాలు
 శాఖాధిపతి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న ఫిజియోథెరపీ క్యాంపులు, భవిత క్యాంపులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వైద్యులు ఉంటే సీఆర్టీలు ఉండరు. సీఆర్టీలు ఉంటే పిల్లలకు సమాచారం ఇవ్వరు. కేజీబీవీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలా కేజీబీవీల్లో అమ్మాయిలు మరుగుదొడ్లు, తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వాటిని పట్టించుకునే నాథుడే లేరు.
 
 జిల్లా వ్యాప్తంగా బడిబయట పిల్లలు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారంటూ ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఇచ్చిన నివేదకతో ఇటీవల స్వయంగా కలెక్టరు మొట్టికాయలు వేశారు. పక్కా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారు లేకపోవడంతో ఊహ లెక్కలు తప్ప పక్కాగా ఎంత మంది ఉన్నారో గుర్తించలేని పరి స్థితి. డైస్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండడం లేదు. కేవలం పోస్టులు కాపాడుకునే క్రమంలో బోగస్ విద్యార్థుల సంఖ్యను చూపిస్తున్నారు. వీటిని పటించుకునే వారు లేరు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో సివిల్ వర్క్స్ నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల మరుగుదొడ్లు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలల్లో పనులు ప్రారంభం కాలేదు.
 
 పది నెలలుగా పీఓ లేరు
 గతంలో ఎస్‌ఎస్‌ఏ పీఓగా ఉన్న కేఎస్ రామారావు సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో ఫిబ్రవరిలో చిత్తూరుకు వెళ్లారు. అప్పటి నుంచి జిల్లా విద్యాఖ అధికారి మధుసూదన్‌రావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. ఈయన ఇటీవల బదిలీ కావడంతో డీఈగా జిల్లాకు వచ్చిన అంజయ్య ఎస్‌ఎస్‌ఏ పీఓగా ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. డీఈఓ చాలా కార్యక్రమాలతో సతమతమవుతున్నారు. ఇక ఎస్‌ఎస్‌ఏ వ్యవహారాలను పరిశీలించే తీరిక ఉండడం లేదు. ఏదో వచ్చిన ఫైళ్లపై సంతకాలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు పర్యవేక్షించే తీరిక ఉండడం లేదు.
 
 జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులోనూ విద్యావేత్త అయిన పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు కుంటుపడుతున్నా...కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యంతో రెగ్యులర్ పీఓ నియామకం సమస్య కొలిక్కిరాలేదు. ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు స్పందించకపోతే వచ్చిన నిధులు కూడా వెనక్కు వెళ్లడం ఖాయం.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement