
నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాల యం.. ఐఏఎస్ అధికారి పాలన.. నిత్యం అక్కడకు పలు సమస్యలతో వచ్చే జనం.. 12 మండలాలున్న డివిజన్‌కు ప్రధాన కార్యాలయం.. నిత్యం సమీక్షలు, సమావేశాలు. సోమవారం వచ్చిందంటే మీకోసం కార్యక్రమం వద్ద అర్జీదా రుల హడావుడి.. ఇదంతా గతం.. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తొమ్మిది నెలలు నుంచి పట్టించుకునే నాథుడు లేకుండా సబ్‌కలెక్టర్ కార్యాలయం తయారయ్యింది. అక్కడకు వెళ్లిన వారికి కనీసం సమాధానం చెప్పేందుకు కూ డా ఎవరూ లేని పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం డెప్యూటీ తహసీల్దార్ ర్యాంకులో ఉన్న నరేష్‌కుమార్ ఇన్‌చార్జి ఏఓగా పనిచేస్తున్నారు.
కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా కార్యాలయంలో లేకపోవడంతో డివిజన్‌లో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భంగా గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన ఈ రెవెన్యూ డివిజన్‌లో సబ్‌కలెక్టర్‌తో సహా పలు పోస్టులు ఖాళీఅయ్యాయి. సోమవారం మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు తీసుకోవడానికి కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా అందుబాటులో లేరు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. చివరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వకుండా కూడా జనం వెనుదిరుగుతున్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ గతేడాది మే 6న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు. కొవ్వూరు ఆర్డీఓను ఇన్‌చార్జ్‌గా నియమించినా కూడా ఆయన ఇక్కడ కార్యాలయం మెట్లెక్కిన సందర్భాలు తక్కువే. కార్యాలయ ఏఓ పీఎన్‌ఎస్ లక్ష్మి, కేఆర్‌సీ తహసీల్దార్ గొంతియ్య కూడా బదిలీ అయ్యారు.
భర్తీ ఎప్పటికో..!
సబ్‌కలెక్టర్ పోస్టుపై రాజకీయ ముసురు అల్లుకుంది. ఇక్కడ ఐఏఎస్‌ను నియమించడంపై డెల్టాలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యతరం చెప్పినట్టు సమాచారం.అప్పటి నుంచి పోస్టును ఖాళీగా పెట్టారు. పోనీ పూర్తిస్థాయి ఆర్డీఓను కూడా నియమించలేదు. ఓవైపు ఎన్నికల సమీపిస్తున్నాయి. సబ్‌కలెక్టర్ లేకపోవడంతో ఇప్పటికే డివిజన్‌లో ఓటరు జాబితాల తయారీ తప్పుల తడకగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ శాఖలోకింద స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలనోటిఫికేషన్‌కు కూడా సమయం దగ్గరపడుతుంది. మరి ప్రభుత్వం సబ్‌కలెక్టర్ పోస్టును ఎప్పటికి భర్తీ చేస్తారో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment