స్విమ్స్‌లో మెరుగైన సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇక్కడ ఇన్‌పేషెంట్లకు కూడా సరైన సేవలందడం లేదు. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో ఫార్మసీ విభాగంలో అరకొర మందులుంటున్నాయి. వైద్యులు రాస్తున్న ప్రిస్క్రిప్షన్ ఒకటైతే ఫార్మసీలో ఇస్తున్నవి వేరొకటి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔట్ సోర్సింగ్ నర్సుల సేవలపై రోగులు పెదవి విరుస్తున్నారు. సిఫార్సు ఉంటేనే అత్యవసర విభాగంలో ఎమర్జెన్సీ కేసులను అనుమతిస్తున్నారు. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి పాదాల చెంత టీటీడీ నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని స్విమ్స్ డైరెక్టర్ పట్టించుకోవడం మానేశారనే విమర్శలు పెరుగుతున్నాయి.
తిరుపతి (అలిపిరి): రాయలసీమలోని నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు 1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడంతో స్విమ్స్‌లోనూ తెల్లరేషన్ కార్డులున్న పేదలకు సూపర్‌స్పెషాలిటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రి నిర్వహణ తీరు విమర్శలకు తావిస్తోంది. నిరుపేదలకు ఆదరణ కరువవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సినదుస్థితి. రోగులను అడుగడుగునా వివక్ష వెంటాడుతోంది.
నిర్లక్ష్యపు వైద్యం..
స్విమ్స్‌లో 900 మందికిపైగా ఇన్‌పేషెంట్లుంటారు. 28కిపైగా విభాగాలున్నాయి. జనరల్ మెడిసిన్, సిటీ సర్జరీ వార్డులలో వైద్య సేవలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా నర్సులు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదయం అల్పాహారం తీసుకోకుండా షుగర్ శాతం కొలుస్తాయి. ఈ పరీక్ష ఇన్‌పేషెంట్లకు తెల్లవారుజామును 2.30లకే చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల షుగర్ శాతం అధికంగా చూపించే ప్రమాదముంది. షుగర్ శాతం అనుగుణంగా వైద్యులు మందులు రాస్తే ఇక ఆ రోగి ఆరోగ్యం మరింత క్షీణించక తప్ప దు. స్విమ్స్‌కు వచ్చి అనారోగ్యం బారిన పడుతున్నామని రోగులంటున్నారు. స్విమ్స్‌లో ఔట్ సోర్సింగ్ నర్సులు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. వీరిపై అధికారులకు ఫిర్యా దు చేసినా స్పందన లేదు.
అవినీతి ఫార్మసీ..
ఫార్మసీ విభాగం అవినీతిమయంగా మారింది. కమీషన్లందుకుని తిరుపతిలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలకు మందుల సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందులో అధికంగా జనరిక్ మందులే ఉంటున్నా యి. వైద్యులు సూచించే మందులు ఫార్మసీలో దొరకడం లేదు. ఏజెన్సీలకు లాభమొచ్చే కొన్ని రకాల మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోగులకు అవగాహన లేకుండా ఇక్కడిచ్చే మందులు వేసుకుంటే మరింత అనారోగ్యం పాలవ్వక తప్పదు. స్విమ్స్‌లో ఉన్నత పదవుల్లో ఉన్న సీఎం బంధువుల కమీషన్ల వ్యవహారం వల్ల ఫార్మసీ సేవలు దెబ్బతింటున్నాయి. అత్యవసర విభాగం సేవలు అధ్వానమే. 15 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 10 కేసులకు స్ట్రెచర్లపై ఉంచి సేవలందిస్తున్నారు. ఇంతపెద్ద విభాగంలో 10 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిఫారసు ఉంటేనే ఇక్కడ చేర్చుకుంటున్నారు. ప్రముఖులకు కూడా ఇక్కడ నామమాత్ర వైద్య సేవలే. సాధారణ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 300 మందికిపైగా వైద్యులు, 250 మందికిపైగా నర్సులు పనిచేస్తున్నారు. పీజీలు, నర్సింగ్, ఎంబీబీఎస్, పారామెడికల్ విద్యార్ధులు రోగులకు సేవలందిస్తున్నారు. అయినా ఇన్‌పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రాయలసీమ ప్రాంతం నుంచే గాక నెల్లూరు నుంచి ఓపీ నిమిత్తం రోజుకు 2వేల మంది రోగులు వస్తుంటారు.
పట్టించుకోని డైరెక్టర్..
స్విమ్స్‌లో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ నెలలో ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటారన్నది చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిగట్టుకుని ఈయన్ను నియమించారు. గత డైరెక్టర్ డాక్టర్ వెంగ మ్మ ఓపీ, వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీసేవారు. సేవా లోపం ఉంటే తక్షణం చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత డైరెక్టర్ అందుబాటులో ఉండడం లేదు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయాలనుకుంటే కనీసం డైరెక్టర్ ఛాంబర్ గేటు వరకు వెళ్లడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment