ప్రభుత్వ శాఖలకు స్టార్ రేటింగ్‌లు
- ఎనిమిది శాఖలకు నో స్టార్ స్టేటస్
- త్రీస్టార్ దక్కించుకున్నవి పది
- కోర్ డ్యాష్‌బోర్డుకిచ్చే డేటా ఆధారంగా రేటింగ్
సాక్షి, విజయవాడ బ్యూరో : మార్కెట్‌లో వస్తువులకు ఇచ్చినట్లు ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం రేటింగ్‌లు ఇచ్చింది. పనితీరును బట్టి త్రీస్టార్, టూ స్టార్, వన్ స్టార్, నో స్టార్ రేటింగ్‌లను ప్రకటించింది. మొత్తం 34 శాఖలకు ఇలా రేటిం గ్‌లు ఇచ్చింది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డులో ఈ వివరాలు ఉంచింది. తక్కువ స్కోర్ పొందిన ఆర్థిక, ఉన్నత విద్య, రోడ్లు- భవనాలు, పర్యాటక, గృహ నిర్మాణం, మత్స్య, మైన్స్ అండ్ జియాలజీ, పాఠశాల విద్యా శాఖలకు నో స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆధార్ సీడింగ్, ఐటీఈ అండ్ సీ, పంచాయతీరాజ్ శాఖలు వ న్ స్టార్ గుర్తింపు పొందాయి. వ్యవసాయం, పశుసంవర్థకం, వాణిజ్య పన్నులు, పరిశ్రమలు, జలవనరులు, ఎక్సైజ్, అటవీ, కార్మిక, రిజిస్ట్ర్రేషన్లు అండ్ స్టాంపులు, మహిళా-శిశు సంక్షేమం, మై బ్రిక్- మై అమరావతి (సీఆర్‌డీఏ), సంక్షేమ శాఖలు టూ స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. ప్రణాళిక, భూగర్భజల, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్య-ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి, ఏఈబీఏఎస్ (ఆధార్ ఎనేబిల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్), పోలీసు, రెవెన్యూ శాఖలు త్రీ స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి.
రేటింగ్ ఇలా: సీఎం కోర్ డ్యాష్ బోర్డులో సమాచారాన్ని షేర్ చేసే విధానాన్ని బట్టి మూడు అంశాల ఆధారంగా స్కోర్ ఇచ్చి ఈ రేటింగ్‌లను ఐటీ శాఖ రూపొందించింది. ఆయా శాఖలు తమ సమాచారాన్ని రియల్ టైమ్‌లో షేర్ చేస్తే 40 శాతం మార్కులు, డేటా రూపకల్పన (కిందిస్థాయి లబ్ధిదారుడు, పనుల స్థాయిలో)కు 30 శాతం, డేటా కచ్చితత్వం, విశ్లేషణ, గ్రాఫ్‌లు, చారిత్రక వివరాల పోలికకు 30 శాతం మార్కులు ఇచ్చారు. 80 శాతం కంటే ఎక్కువ మార్కులొస్తే త్రీస్టార్, 70 నుంచి 80 శాతం వస్తే టూ స్టార్, 60 నుంచి 69 శాతం వస్తే వన్ స్టార్, 60 శాతం కంటే తక్కువొస్తే నో స్టార్ రేటింగ్ ఇచ్చారు. 34 శాఖల పరిధిలోని 75 విభాగాలకు మొద ట మార్కులిచ్చి వాటిని శాఖలవారీ క్రోడీకరించగా వచ్చిన తుది స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగాల్లో కొన్నింటి కి సున్నా మార్కులు రాగా, మరికొన్నింటికి 10, 25, 40 వచ్చాయి. జలవనరుల శాఖలో ని నీరు-చెట్టు, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇసుక తవ్వకాలకు సున్నా పడ్డాయి.