ట్రిపుల్ ఐటీలో మళ్లీ ధర్నా
విద్యార్థులతో డీఎస్పీ, సీఐ, డెరైక్టర్ల చర్చలు
వేంపల్లె(ఇడుపులపాయ): ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం పోలీసు పహారా నిర్వహించారు. శుక్రవారం తమను అనవసరంగా భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ ఇన్‌ఛార్జి సీఐ రసూల్ కొట్టారని, మహిళా సెక్యూరిటీ గార్డుల నుంచి వేధింపులు ఉన్నాయని విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన అధికారులు సీఐ రసూల్ క్షమాపణతోపాటు హెచ్‌ఆర్‌టీ చిన్నారెడ్డి, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేస్తున్నట్లు డెరైక్టర్ ప్రకటించారు.
11డిమాండ్లను విద్యార్థులు పరిష్కరించాలని కోరగా, దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భోజనం విరామం తర్వాత మళ్లీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హెచ్‌ఆర్‌టీ చిన్నారెడ్డి ఎట్టి పరిస్థితులలోనూ క్షమాపణ చెప్పి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు.
విషయాన్ని తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి వారితో చర్చలు జరిపి, ఆందోళనను విరమించేలా చేశారు. శనివారం కూడా విద్యార్థులు ధర్నాకు దిగుతారని సంకేతాలు రావడంతో పోలీసు పహారా చేపట్టారు.
డీఎస్పీ హరినాథబాబు, రూరల్ సీఐ మహేశ్వరరెడ్డిలతోపాటు 5మంది ఎస్‌ఐలు, 50మంది పోలీసులు క్యాంపస్‌లో పహారా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. హెచ్‌ఆర్‌టీ చిన్నారెడ్డిని సస్పెండ్ చేసినట్లు డెరైక్టర్ చెబుతున్నారని, క్యాంపస్‌లోకి ఒకవేళ వచ్చిన తర్వాత పునరాలోచిస్తామని వివరించారు. అంతేకాక మొండి వైఖరిని విడనాడి ట్రిపుల్ ఐటీలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పీ హరినాథబాబు సూచించారు. దీంతో ప్రస్తుతం అక్కడ సమస్య సద్దుమణిగినట్లు తెలుస్తోంది.