రాయచోటి/లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌లైన్ : అధ్యాపకుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి(ఆర్‌ఆర్) ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తరువాత మంత్రి పదవులనూ అధిష్టించారు. తన చతురతతో రాజకీయ దిగ్గజంగా పేరు పొందారు. ఎమ్మెల్యే, మంత్రి పదవుల్లో ఉండగా అనేక సమస్యలను పరిష్కరించారు. ఆర్‌ఆర్‌గా అందరూ ముద్దుగా పిలుచుకునే ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఆర్‌ఆర్ ప్రస్థానం
లక్కిరెడ్డిపల్లె మండలం రెడ్డివారిపల్లెలో రెడ్డెప్పగారి ఓబులమ్మ, గురివిరెడ్డి దంపతులకు 1933 అక్టోబరు 20న జన్మించిన ఆర్‌ఆర్ ప్రాథమిక విద్యను 1938 నుంచి 1943 వరకు లక్కిరెడ్డిపల్లె ఎలిమెంటరీ స్కూలులో అభ్యసించారు. 6 నుంచి 9 వరకు రాయచోటి ఉన్నత పాఠశాలలో, ఎస్‌ఎస్‌ఎల్‌సీ చిత్తూరు జిల్లా మదనపల్లె ఉన్నత పాఠశాలలో చదివారు. 1954లో అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించారు. 1954-56 వరకు కర్నూలు నీటి పారుదల శాఖలో ఇంజినీర్గా పని చేశారు.1956-57లో కృష్ణా జిల్లా ఉయ్యూరు ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు.
సోదరుడి కోరిక మేరకు రాజకీయాల్లోకి...
తన సోదరుడు, జెడ్పీ మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి అభీష్టం మేరకు ఆయన 1959లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో తొలిసారిగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1967లో తిరిగి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1972లో రెండో శాసనసభకు ఎన్నికై 1973లో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో కొద్దిరోజులు నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983-85 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో ఆయన రాష్ట్ర రోడ్డు రవాణా, వ్యవసాయ శాఖమంత్రిగా కూడా పని చేశారు. 1989లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఐదో పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవడంతో అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రాజెక్టుల రూపకల్పనలో...
ఆర్‌ఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, కుషాతి, బుగ్గవంక, కాలేటివాగు, గంగనేరు, చిన్నపోతులవారిపల్లె రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఆర్‌ఆర్ ఎంతో కృషిచేశారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల రూపకల్పనలోనూ తనవంతు కృషి చేశారు. ఆర్‌ఆర్ రైతు కుటుంబం నుంచి పెకైదగడంతో అధికంగా వ్యవసాయం, సాగునీటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.
రాజకీయాలలో మృదుస్వభావి అంటే ఆర్‌ఆర్‌ను మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. దీర్ఘకాలంగా రాజకీయాలలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారాయన. వేంపల్లె నాగిరెడ్డి అల్లుడుగా రాజగోపాల్‌రెడ్డి జిల్లా వాసులకు సుపరిచితుడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రమేష్‌కుమార్‌రెడ్డి ఒక పర్యాయం లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా కొనసాగారు. మరో కుమారుడు శ్రీనివాసులురెడ్డి క్లాస్-1 కాంట్రాక్టరుగా, కుమార్తె రాధ భర్త చెన్నైలో ఐజీగా పని చేస్తున్నారు. భార్య హేమలతమ్మతో కలసి జీవిస్తున్న ఆయన ఊహించని రీతిలో గుండెపోటుకు గురయ్యారు.
వైఎస్ పని తీరును మెచ్చుకున్న ఆర్‌ఆర్
జిల్లా రాజకీయాలల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవతిరేక గ్రూపులో మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి ఒకరు. అయినా పలు పర్యాయాలు వైఎస్‌ను ఆయన మెచ్చుకున్నారు. సీఎంగా వైఎస్ రాయలసీమకు ప్రాణప్రదమైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టారు. అప్పట్లో కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు, టీడీపీకి చెందిన కోస్తా, తెలంగాణ ప్రాంత నేతలు వ్యవతిరేకతను వ్యక్తం చేశారు.
అప్పట్లో టీడీపీలో ఉన్న ఆర్‌ఆర్ మాత్రం వైఎస్ చొరవను ప్రశంసించారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఆవశ్యకతను వివరిస్తూ పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు. వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని ఆయన సమర్థించారు. రాజశేఖరరెడ్డి కాబట్టే సాహసోపేతమైన పనులు చేపట్టారని అభివర్ణించారు. వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి వసతి కల్పిస్తేనే అభివృద్ధిలోకి వెళ్తాతాయని ఆర్‌ఆర్ అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. పార్టీలు వేరైనా ప్రాంతం కోసం పాటుపడిన వైఎస్‌ను అనేక మార్లు భేష్ అంటూ ఆర్‌ఆర్ మెచ్చుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం.
అసలు సిసలైన సమైక్యవాది
జిల్లా రాజకీయ అగ్రగణ్యుడైన ఆర్‌ఆర్ అసలు సిసలైన సమైక్యవాదని పలువురు చెబుతుంటారు. రాష్ట్రంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం తరువాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం ఊపుందుకుంది. కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమం వైపు మొగ్గు చూపారు.
ఆ రెండు ఉద్యమాల సందర్భంగా నిర్మోహమాటంగా సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఆర్‌ఆర్ తన అభిప్రాయాలను చెప్పినట్లు పలువురు గుర్తు చేశారు. 2009లో కేంద్రమంత్రి చిదంబరం రాష్ర్ట విభజన నిర్ణయం ప్రకటన చేపట్టగానే ఆర్‌ఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, చిదంబరంపైనా ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తే తమిళుల ప్రాధాన్యం పెరుగుతుందన్న కుట్రతోనే ఈ ప్రకటన చేశారని కూడా ఆయన విమర్శలు చేశారు. విభజనతో సీమతో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతాయని అనేక సందర్భల్లో ఆర్‌ఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతో ప్రయోజనం లేదని నమ్మిన వ్యక్తి.
రాజకీయ దిగ్గజం ఆర్‌ఆర్
Published Thu, Sep 19 2013 3:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement