
విభజన చిచ్చుపెట్టింది సోనియానే: బాబు
సాక్షి, విజయనగరం: ‘‘వెన్నుపోటు పొడవాలనుకునే భావనలు ఉన్న వారే గాడ్సేలు.. ఆ గాడ్సేయే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. అన్నదమ్ముల్లా కలసి ఉన్న వారి మధ్య విభజన చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు.. దేశంలో అన్ని సమస్యలకు సోనియానే కారణం. దేశంలో సోనియా అతిపెద్ద అవినీతి అనకొండ.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలి. ఆ పార్టీ నేతలంతా దుర్మార్గులు.. వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలి...’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రులను ఒప్పించండి.. సమైక్యాంధ్ర ఉండాలంటే తెలంగాణ వాళ్లను మెప్పించండని చెప్పా. కానీ సోనియాగాంధీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టింది’’ అని సోనియాపై ఆరోపణలు గుప్పించారు. ‘‘తెలుగు జాతి ఐక్యత కోసం ఢిల్లీలో ఉంటున్న పెద్దలను పదిసార్లు కలిశాను. సమధర్మం చేయమన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రాధేయపడ్డాను.
ముఖ్యంగా బీజేపీ నుంచి నేనెంతో ఆశించాను.. కానీ అన్యాయం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం ఆ పార్టీ పార్లమెంటులో పోరాడలేదు’’ అని బీజేపీని కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఈ దుర్మార్గులు ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఆరు నెలలు ఆగండి మేమే అభివృద్ధి చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘ఎన్ని సమస్యలున్నా ఇటు సీమాంధ్రను, అటు తెలంగాణను నేనే నిర్మిస్తా.. పూర్వవైభవాన్ని తీసుకొస్తా.. రెండు సార్లు ప్రధాని అవకాశం వస్తే మీ కోసం వదలుకున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు. నేనిప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడడం లేదు. మీ కష్టాలను తీర్చేందుకే నడుంకట్టాను’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై ఆలోచన ఏమైనా ఉందా? అని గవర్నర్ తనకు ఫోన్ చేసి అడిగారని.. తాను గట్టిగా బదులిచ్చానని చెప్పారు.
ఏదైనా చట్టబద్ధంగా జరగాలని చెప్పానని.. లేదంటే ‘మిమ్మల్ని వదిలిపెట్టను’ అని చెప్పానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఏది జరిగినా దానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని బాబు విమర్శించారు. ‘‘జిల్లాను ఏకంగా లూటీ చేశాడు, లిక్కర్, ఇసుక, భూమాఫియాలు చేసి దందా నడిపాడు’’ అని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఉన్న పలు మీడియాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇందంతా ఒక ప్యాకేజీ అని, దానిని నమ్మవద్దని ప్రజలతో పేర్కొన్నారు.
కేసీఆర్ క్యారెక్టర్ లేని వ్యక్తి
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, బ్లాక్‌మెయిల్ ఉద్యమాలు నడిపారని చంద్రబాబు అన్నారు. విజయనగరంలో బుధవారం జరిగిన ప్రజాగర్జన సభ అనంతరం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని తప్పుడు లెక్కలు వేయడంతో పాటు, దొంగమాటలు ఆడడంలో కేసీఆర్ మొదటి వరుసలో నిలుచుంటారని మండిపడ్డారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కార్యకర్తలే కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ వాళ్లు వైఎస్‌ఆర్ సీపీలోకి వెళ్లే ప్రమాదముందని, వారిని కలుపుకుపోవాలని సూచించారు. అయితే దీనిపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు బొత్స, షాడోనేతలు తమను వేధించారని, ఇప్పుడు వారితో ఎలా కలిసి వెళతామని జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన రవి ప్రశ్నించారు. సమస్యలున్నా సర్దుకుపోవాలని బాబు సమాధానమిచ్చారు.