
సాక్షి, అమరావతి: చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఇప్పటికే ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ, బోధనాసుపత్రిలోనూ 5 పడకలతో కూడిన ప్రత్యేక వార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు వెంటిలేటర్ సదుపాయాన్నీ కల్పించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎలాంటి కేసులూ నమోదు కాకపోయినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించారు. విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా. వి.రాంబాబును పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్యవిద్యా సంచాలకులు డా. కె.వెంకటేష్ ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇలాంటి వ్యాధి లక్షణాలతో ఎవరికైనా వైద్యం అందిస్తుంటే ఆ వివరాలు ఆ జిల్లా వైద్యాధికారికి తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ సోకినట్టు ఎక్కడైనా గుర్తిస్తే వారికి ప్రొటోకాల్ (నిబంధనల మేరకు) వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు మన రాష్ట్రంలో ఇంతవరకూ నమోదు కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే వార్డుల సంఖ్య పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment