
సాక్షి, అమరావతి : ఇజ్రాయిల్ దేశానికి చెందిన వెరిన్ట్ కంపెనీకి చెల్లింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి గురువారం లేఖ రాశారు. నిపుణుల అభిప్రాయంగానీ సలహాగానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించినట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో వివరించారు. నిబంధనల ప్రకారం ప్రమాణాలను, విధివిధానాలను పాటించకుండా ఈ ప్రతిపాదనను ఆమోదించారని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేలోగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన చెల్లింపులు చేసేలా.. స్వార్థ ప్రయోజనాలు కలిగిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. 12.5 కోట్ల రూపాయల బిల్లు ఒకటి డీజీపీ కార్యాలయం (పీ అండ్ ఎల్) నుంచి పీఏఓ ఆమోదం కోసం వచ్చిందని, అయితే.. నిధులు లేక దాన్ని నిలిపి ఉంచారని పేర్కొన్నారు. వెబ్ ఇంటెలిజెన్స్‌కు సాఫ్ట్‌వేర్‌ను, దొంగచాటుగా ఇతరుల సమాచారాన్ని పొందే ఐఎంఎస్‌ఐ క్యాచర్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేసే ఇజ్రాయిల్ కంపెనీ వెరిన్ట్‌కు ఈ మొత్తాన్ని చెల్లించాలని చూస్తున్నారని విజయసాయిరెడ్డి తన లేఖలో తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, కొందరు ఉన్నతాధికారులు, అధికారుల ఫోన్ల టాపింగ్ వెనుక ఎవరెవరి హస్తం ఉందో, ఎటువంటి నిగూఢ లావాదేవీలు జరిగాయో వెల్లడి కావాల్సి ఉన్నందున ఈ బిల్లును క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఫైల్ వెలుగులోకి రాకుండా చూడాలని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని ఆయన వివరించారు. ఈ ఫైల్‌లో ఐఎంఎస్‌ఐ క్యాచర్స్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదని, కేవలం వెబ్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వివరాలు మాత్రమే ఇచ్చి తప్పుదోవ పట్టించారని వివరించారు. ఐఎంఎస్‌ఐ క్యాచర్స్ సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టి వెబ్ ఇంటెలిజెన్స్ విషయాలను ప్రస్తావించడం ద్వారా ఈ ఫైల్‌కు చట్టబద్ధత కల్పించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకుని పీఏఓలో పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించకుండా నిలిపి ఉంచాలని సీఎస్‌కు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment