వృద్ధి రేటు 11.72 శాతం: సీఎం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచిందన్నారు. అత్యధిక తలసరి ఆదాయం హర్యానాలో ఉందన్నారు. కేవలం నిధులు వెచ్చించగానే వృద్ధి చెందుతామని అనుకోవడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించాలన్నారు.
శుక్రవారం సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యదర్శులు, శాఖాధిపతుల సదస్సుల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ శాఖ అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. తొలి త్రైమాసికంలో సాధించిన 11.72 శాతం వృద్ధిలో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదే కావటంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణపై మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఫిషరీస్ కమిషనర్ శంకర్ నాయక్‌తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను సీఎం గుర్తు చేశారు.
సీఎస్‌కూ బయోమెట్రిక్ హాజరు
పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు తనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదును తప్పనిసరి చేస్తున్నట్లు సీఎం చెప్పారు.