కరువున్నా వృద్ధి రేటు 11.61%
⇒ దేశ వృద్ధిరేటు 7.11 శాతమే
⇒ ఆర్థిక ఫలితాలపై సంతృప్తిగా ఉన్నా: సీఎం
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరంలో కరువు నెలకొన్నా రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని కొనసాగించామని సీఎం చంద్రబాబుచెప్పారు. ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో రాష్ట్రం 11.61 శాతం వృద్ధిరేటు సాధించిందని, దేశ వృద్ధిరేటు మాత్రం 7.11 శాతమే ఉందని తెలిపారు. వ్యవసాయం–వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర వృద్ధిరేటు 14.03 శాతం ఉండగా, దేశంలో 4.37 శాతం ఉందన్నారు. పరిశ్రమల రంగంలో 10.05 శాతం, సేవల రంగంలో 10.16 శాతం వృద్ధి నమోదు చేయగా, ఇదే సమయంలో దేశ వృద్ధి 5.77 శాతం, 7.87 శాతం ఉన్నాయని వివరించారు. వీటిపై తాను సంతృప్తిగా ఉన్నానన్నారు.
ఈ ఉత్సాహంతో 2017–18లో 15 శాతం వృద్ధి నమోదు చేద్దామని అధికారులను కోరారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బాబు మాట్లాడారు. సేవలరంగ వృద్ధి కోసం త్వరలో కార్యదర్శులతో అధ్యయన కమిటీ నియమిస్తామని తెలిపారు.పరిపాలనా సంస్కరణలపైనా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర పథకాలు, కేంద్ర నిధులు ఖర్చు చేయడంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 నమోదు చేస్తే, దేశ తలసరి ఆదాయం రూ.1,03,818 మాత్రమే ఉందని చెప్పారు. దేశం కన్నా రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.18,558 ఎక్కువగా ఉందన్నారు.