![State Level Martial Arts Champion Charan Special Story - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/9/charan.jpg.webp?itok=pV12FPhg)
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: నేర్చుకోవాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలైనా మనముందు తలొంచాల్సిందే.. మన పట్టుదల ముందు ఎంతటి ప్రతిభైనా మోకరిల్లాల్సిందే.. అందుకు ఉదాహరణే మార్షల్ ఆర్ట్స్‌లో రాటుదేలుతున్న కోటిపల్లి చరణ్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్‌కు ఊహ తెలిసేటప్పటికీ తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. తణుకుకు చెందిన పెద్దమ్మ, పెద్ద నాన్నలే చేరదీశారు. అనుకోకుండా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ చూసి ఆకర్షితుడయ్యాడు. అతన్ని గురువు ఆదరించి శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు.
చరణ్ ఆసక్తిని గమనించి.. తణుకు సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి వేదికగా మార్షల్ ఆర్ట్స్ గురువు డీడీ సత్య ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఉదయం సమయంలో ఈ శిక్షణను గేటు బయట నుంచే చరణ్ గమనించేవాడు. ఆ విషయం తెలుసుకున్న గురువు సత్య.. నేర్చుకుంటావా? అని ప్రశ్నించగా చరణ్ వెంటనే తలూపాడు. అప్పటి నుంచి ఉచితంగా శిక్షణ తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చూపుతున్నాడు. ఒకసారి చెబితే పంచ్‌లను ఇట్టే పట్టేస్తాడు. సజ్జాపురం ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చరణ్ చదువులోను తెలివైన విద్యార్థే. చిన్నవాడైనా తన కంటే పెద్దవారితో సమానంగా ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ రెండు పతకాలు సాధించాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన కరాటే టోర్నమెంట్‌లో బంగారు పతకం, విశాఖపట్నంలో జరిగిన వాకో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. ఇంటర్నెట్‌లో చూసి కాగితాలు, ఇతర వ్యర్థాలతో రకరకాల బొమ్మలు చేస్తూ ఆకట్టుకుంటాడని ఉపాధ్యాయులు చెబు తున్నారు. పెద్దమ్మ, పెదనాన్నలు కోటిపల్లి దుర్గా భవాని, వెంకటేశ్వరరావులు చరణ్, అతని అన్న సామ్యేల్ బాధ్యతను తీసుకున్నాడు.
ఫైటింగ్ అంటే చాలా ఇష్టం
నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ, పెదనాన్నల ప్రోత్సాహం, గురువు సత్య ఉచిత శిక్షణతో మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నాను. సొంత డబ్బులతో మా గురువే టోర్నమెంట్‌లకు తీసుకువెళ్తున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది నా కోరిక.– కోటిపల్లి చరణ్, తణుకు
స్పాన్సర్లు కావాలి..
మార్షల్ ఆర్ట్స్‌లో చరణ్‌కు మంచి నైపుణ్యం ఉన్నా.. ఖరీదైన క్రీడ కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రీడల్లో రాణించాలంటే మంచి పోషకాహారం అవసరం. పేదరికం కారణంగా చరణ్‌కు ఆ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. స్పాన్సర్లు అండగా నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫైటర్ అవుతాడు. ఎటైనా వంగే శరీర తత్వం అతనిది. మరింత ప్రోత్సహిస్తే విజయాలు సాధించడం ఖాయం.
– డీడీ సత్య, మార్షల్ ఆర్ట్స్ గురువు
చదువులోను చురుకే
చరణ్ చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.– జి.రుద్రమదేవి, ప్రాథమికోన్నత పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం, తణుకు
Comments
Please login to add a commentAdd a comment