ఎన్నికల తర్వాతే పునర్విభజన: ఈసీ
2011 జనాభా లెక్కలతో సాధ్యం కాదు
లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా లోక్‌సభతోపాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయున్న ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు, జరుగకపోవచ్చుననే అర్థం వచ్చేలా తెలంగాణ ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. తుది బిల్లులో దీనికి స్పష్టత ఇస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి.
దీంతో విభజన జరిగినప్పటికీ లోక్‌సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చేయాలని, ఇటీవలే పునర్విభజన జరిగినందున రిజర్వేషన్లలో పెద్ద తేడా రాదని ఈసీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కమిషన్ పరిశీలనలో ముఖ్యాంశాలు ...
నియోజకవర్గాల పునర్విభజనకు ఏడాదికిపైగా పడుతుంది.
అప్పటిదాకా ఎన్నికలను ఆపడం సాధ్యం కాదు.
ఇదేసంగతి కేంద్రహోంశాఖకు కూడా స్పష్టం చేశారు.
ఈనెల 31న ఓటర్ల జాబితాలను ప్రకటించి, రాజకీయ పార్టీలకు ఆ జాబితాలను అందజేయాలి.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలపై నివేదికలను వచ్చేనెల 15లోగా కమిషన్‌కు పంపించాలి.
ఎన్నికల విధులను తప్పించుకోవడానికి బదిలీలను సాకుగాచూపే విజ్ఞప్తులను అనుమతించరు.
ఎన్నికల విధులతో సంబంధం ఉన్న సిబ్బందిని ఫిబ్రవరి 10లోగా బదిలీ చేయాలి.
బదిలీ అయినవారంతా 11వ తేదీన విధుల్లో చేరాలి.
ఎన్నికలతో సంబంధం లేని వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు.