State assembly elections
-
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి: సోనియా
న్యూఢిల్లీ: ప్రజామోదం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంసిద్ధం కావాలని నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత బాగా పెరిగింది. ఇది చూసి అతివిశ్వాసాన్ని మీ దరి చేరనీయకండి’ అని నేతలకు హితవు పలికారు. -
Election Commission of India: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది. ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది. కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా...
కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఈ ఏడాది ఎలా ఉంటుంది ? గతేడాదితో పోలిస్తే ఏం మార్పులొస్తాయి? సామాన్యుల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరి మదిలో ఇవే ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కొల్లగొట్టాలంటే మోదీ చరిష్మా, రాహుల్ గాంధీ పాదయాత్ర, కేజ్రివాల్ క్రేజ్ కీలకంగా మారాయి... ఇది ఎన్నికల ఏడాది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్ అనుకుంటే ఇవి సెమీఫైనల్స్‌గా భావించవచ్చు. 2022లో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ అత్యంత కీలకమైన యూపీ, గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు గోవా (2 స్థానాలు), గుజరాత్ (5 సీట్లు)లో ఖాతా ప్రారంభించి జాతీయ స్థాయిలో ఒక కొత్త శక్తిగా ఎదిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది ? వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారుతాయన్న చర్చ వేడెక్కిస్తోంది. త్రిపుర నుంచి తెలంగాణ వరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి త్రిపుర, మేఘాలయాలో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగుతూ ఉండడంతో మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, పెరిగిపోతున్న ధరలు, సైద్ధాంతికపరమైన విభేదాలు, మత పరమైన విభజనలు,, సామాజిక అస్థిరతలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎన్నికల్ని ఎలాంటి మలుపు తిప్పుతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. బీజేపీ వ్యూహాలు ఇలా..! కేంద్రంలో అధికార బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత చరిష్మానే నమ్ముకుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక అంశాలే కీలకంగా మారినప్పటికీ కమలనాథులు మరోసారి మోదీ మ్యాజిక్‌నే పరీక్షకు నిలబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ప్రతీ నిర్ణయం తీసుకోనుంది. అన్నింటికి మించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్రబడ్జెట్ ఈ ఎలక్షన్ ఏడాదిలో సలక్షణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. విదేశీ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తున్న మోదీ సర్కార్ వచ్చే సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ–20 సదస్సు ద్వారా భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టామన్న నినాదంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవచ్చంటున్నారు. సదస్సుకు ముందే జమ్ము కశ్మీర్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మోదీ, అమిత్ షా ద్వయం భావిస్తోంది. డిసెంబర్ నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే మతపరంగా ఓట్లను ఏకీకృతం చేసే వ్యూహం ఫలించి ఢిల్లీ పీఠం మరోసారి తమకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసం అధికార పార్టీలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందా ? కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించే రెండు ఘటనలు 2022లో జరిగాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి మల్లిఖార్జున్ ఖర్గేకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారా ఒక కొత్త చరిత్ర నెలకొల్పితే, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో చరిత్రగా మారుతోంది. రాహుల్ పాదయాత్రకి వస్తున్న ప్రజాదరణని చూస్తుంటే తనపైనున్న పప్పు ముద్రను తొలగించుకొని రాహుల్ సరికొత్త రాజకీయ నాయకుడిగా ఎదిగే రోజు ఎంతో దూరం లేదనే అనిపిస్తోంది. పార్లమెంటు వేదికగా బీజేపీని ఇరుకున పెట్టేలా మాటల తూటాలు విసురుతూ, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతర్గత పోరుల్ని చక్కదిద్దుతూ మల్లికార్జున ఖర్గే తన కొత్త బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూ ఉండడం కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకుంటూనే, తమకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని మోదీని ఎదుర్కొనే నాయకుడిగా రాహుల్ అవతరిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 2022 తీపి జ్ఞాపకాలనే అందించి వెళ్లింది. జాతీయ పార్టీగా కొత్త హోదా రావడంతో ప్రధాని మోదీ చరిష్మాకు దీటుగా నిలబడే వ్యక్తిగా కేజ్రీవాల్ నిలబడతారని ఆ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించడం ద్వారా తాను పూర్తిగా రేసు నుంచి తప్పుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మరిన్ని రాష్ట్రాలకు తమ పార్టీలని విస్తరించి జాతీయ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఢిల్లీ పీఠంపైనే గురి పెట్టడంతో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి వీరంతా కలసికట్టుగా ఉండే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్‌ని కలుపుకుంటూ పోతూ విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే ప్రధాని మోదీని ఎదుర్కొని నిలబడగలరు. ప్రతిపక్షాలు చేతులు కలిపి బీజేపీకి సవాల్ విసురుతారో లేదో ఈ ఏడాదిలోనే తేలిపోనుంది. 2023 కేలండర్ ► ఫిబ్రవరి–మార్చి: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ► మే: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు ► జూలై– ఆగస్టు: 10 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధిక సీట్లు ► నవంబర్–డిసెంబర్: హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక అసెంబ్లీ వంతు!
17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగను న్నాయి. ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 119 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మిత్రపక్షాలు 108 సీట్లు గెలుచుకున్నాయి హరియాణా, ఢిల్లీలలోని మొత్తం సీట్లను(17) బీజేపీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కాషాయపక్షం భాగస్వామి శివసేనకు 19 లోక్‌సభ సీట్లు దక్కాయి. బిహార్‌లోని 40 సీట్లలో ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ చెరో 16 స్థానాలు, లోక్‌జన్ శక్తి పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. ఢిల్లీలో త్రిముఖ పోటీ? వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పాలకపక్షమైన ఆప్, కాంగ్రెస్‌లతో బీజేపీకి త్రిముఖ పోటీ తప్పదు. 2015 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 67 కైవసం చేసుకోగా బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేక మూడో స్థానానికి దిగజా రింది. గత నవంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా ప్రకటించలేదు. అయిదు నెలల క్రితం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయిం ది. ఛత్తీస్‌లో మొత్తం 11లో రెండు స్థానాలే సాధించగలిగింది. మధ్యప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీరు గమనించి కొన్ని రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలెవరో అంచనా వేసి చెప్పడం కుదిరేపని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలు మారడమే కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో పరిగణించే అంశాలకూ, అసెంబ్లీ ఎన్నికల్లో వారిని కదిలించే విషయాలకూ ఉండే తేడాల వల్ల గెలిచే పార్టీలపై జోస్యం చెప్పడం కష్టమని చండీగఢ్ విశ్లేషకుడు ఘనశ్యామ్ దేవ్ అభిప్రాయపడ్డారు. -
'స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేయండి'
హైదరాబాద్ : ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అధికారం ఏఐసీసీదేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు అంశాన్ని పరిశీలించేందుకు హైకమాండ్ ఆంటోనీ కమిటీని వేసిందని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. మరోవైపు టికెట్ల కోసం గాంధీభవన్‌లో నేతలు పాట్లు పడుతున్నారు. దిగ్విజయ్ సింగ్ నేతలు విడివిడిగా కలిసి ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక చక్కటి వాగ్థాటి కలిగిన ముప్పై మంది స్టార్ ప్రచారకర్తల్ని ఎంపిక చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆదేశించారు. స్టార్ క్యాంపెయినర్ల ఖర్చు పార్టీ పద్దులోకి వెళ్తుందని కాబట్టి అద్భుత వ్యక్తుల్ని ఎంపిక చేయాలని సూచించారు. తెలంగాణలో ఓట్లు సాధించేందుకు జాతీయస్థాయి నాయకులు ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై జాబితా రూపొందించమని కూడా సూచించారు. దళితులు, మైనార్టీలు, రైతులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో.. ఎవరితో ప్రచారం చేయిస్తే బాగుంటుందో పరిశీలించాలన్నారు. -
22-28 తేదీల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా: దిగ్విజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాససనభ ఎన్నికల్లో పోటీచేయబోయే కాంగ్రెస్ అభ్యర్థులను ఈ నెల 22-28 తేదీల్లో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీలతో సమావేశమై వారి అభిప్రాయాలను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్‌సింగ్ నేరుగా బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముఖం చాటేశారు. గురువారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న దిగ్విజయ్‌కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మినహా ఆ ప్రాంత నాయకులెవరూ రాలేదు. ఆయన బసచేసిన హోటల్ వద్దకు సైతం మాజీమంత్రి సి.రామచంద్రయ్య మినహా సీమాంధ్ర నేతలెవరూ రాలేదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి తరలివచ్చి దిగ్విజయ్‌కు స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, వీహెచ్, పొన్నం, అంజన్, రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ, పలువురు సీనియర్ నేతలు అక్కడికి వచ్చారు. అందరినీ కలుపుకుని ముందుకువెళ్తాం: పొన్నాల అంతకువుుందు వివూనాశ్రయుం వద్ద పొన్నాల లక్ష్మయ్య మీడియాతో వూట్లాడుతూ.. అందరిని కలుపుకుని వుుందు కు వెళ్తూ పార్టీని వురింత పటిష్టంగా చేస్తామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వూట్లాడుతూ దిగ్విజయ్ సలహాలు, సూచనలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో సమీక్ష
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, ఈ నెల 9న ఓటర్ల నమోదు తదితర అంశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ సమీక్షించారు. ఈ మేరకు గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9న రాష్ట్రంలోని 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా బూత్‌స్థాయి అధికారులు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉండాలని, ఇందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు వచ్చి జాబితాలో తమ పేరు చూసుకుని, పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవడానికి బూత్‌స్థాయి ఆఫీసర్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ పేర్కొన్న అన్ని సౌకర్యాల కల్పనకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించబోమని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా ఆస్తులు, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్లో అన్ని కాలాలను పూర్తి చేయకపోతే అలాంటి నామినేషన్లను స్య్రూటినీలో తిరస్కరించాలని కలెక్టర్లకు ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల బయట నోటీసు బోర్డులో ప్రజలందరూ చూసేలా ఉంచాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలుతో 9న ఓటర్ల నమోదు కోసం నిర్వహించే బూత్‌స్థాయి ఆఫీసర్ల సమావేశాలపై కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ వినోద్ జుత్సి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భన్వర్‌లాల్‌తో సమీక్షించారు. -
ఎన్నికల పరిశీలకులుగా 231మంది అధికారులు: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని రకాల పరిశీలకుల నియామకంపైనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భ న్వర్‌లాల్ దృష్టి సారించారు. షెడ్యూల్ విడుదలవ్వగానే ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల పరిశీలకులుగా మొత్తం 231 మంది అధికారులు రానున్నట్లు సోమవారం విలేకరులకు భన్వర్‌లాల్ తెలిపారు. ఒక్కో లోక్‌సభ స్థానానికి ఇద్దరేసి చొప్పున 42 లోక్‌సభ స్థానాలకు మొత్తం 84 మంది ఇతర రాష్ట్రాల అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు వివరించారు. అలాగే రెండేసి అసెంబ్లీ స్థానాలకు ఒకరు చొప్పున 294 అసెంబ్లీ స్థానాలకు 147 మంది ఇతర రాష్ట్రాల అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు. వీరు ఎన్నికల నియమావళి అమలు తీరుతెన్నులతో పాటు, నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు నియమావళిని పాటించారా లేదా, ఎన్నికల వ్యయం నిబంధనలకు లోబడే ఉందా లేదా అనే విషయాలను చూస్తారని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్రం నుంచి 55 మంది ఐఏఎస్ అధికారులు వెళ్లనున్నారని ఆయన తెలిపారు. ఇదిలావుంటే.. ఎన్నికల నియామవళిని అమలు చేయడానికి ఒక్కో జిల్లాకు 15 మంది నోడల్ ఆఫీసర్ల చొప్పున 23 జిల్లాలకు 345 మంది నోడల్ ఆఫీసర్లతో బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
ఎన్నికల తర్వాతే పునర్విభజన: ఈసీ
-
ఎన్నికల తర్వాతే పునర్విభజన: ఈసీ
2011 జనాభా లెక్కలతో సాధ్యం కాదు లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు: ఈసీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినా జరగకపోయినా లోక్‌సభతోపాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయున్న ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు, జరుగకపోవచ్చుననే అర్థం వచ్చేలా తెలంగాణ ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. తుది బిల్లులో దీనికి స్పష్టత ఇస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో విభజన జరిగినప్పటికీ లోక్‌సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చేయాలని, ఇటీవలే పునర్విభజన జరిగినందున రిజర్వేషన్లలో పెద్ద తేడా రాదని ఈసీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషన్ పరిశీలనలో ముఖ్యాంశాలు ... నియోజకవర్గాల పునర్విభజనకు ఏడాదికిపైగా పడుతుంది. అప్పటిదాకా ఎన్నికలను ఆపడం సాధ్యం కాదు. ఇదేసంగతి కేంద్రహోంశాఖకు కూడా స్పష్టం చేశారు. ఈనెల 31న ఓటర్ల జాబితాలను ప్రకటించి, రాజకీయ పార్టీలకు ఆ జాబితాలను అందజేయాలి. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలపై నివేదికలను వచ్చేనెల 15లోగా కమిషన్‌కు పంపించాలి. ఎన్నికల విధులను తప్పించుకోవడానికి బదిలీలను సాకుగాచూపే విజ్ఞప్తులను అనుమతించరు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న సిబ్బందిని ఫిబ్రవరి 10లోగా బదిలీ చేయాలి. బదిలీ అయినవారంతా 11వ తేదీన విధుల్లో చేరాలి. ఎన్నికలతో సంబంధం లేని వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు.