ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో సమీక్ష
జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, ఈ నెల 9న ఓటర్ల నమోదు తదితర అంశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ సమీక్షించారు. ఈ మేరకు గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9న రాష్ట్రంలోని 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా బూత్‌స్థాయి అధికారులు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉండాలని, ఇందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు వచ్చి జాబితాలో తమ పేరు చూసుకుని, పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవడానికి బూత్‌స్థాయి ఆఫీసర్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ పేర్కొన్న అన్ని సౌకర్యాల కల్పనకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించబోమని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.
అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా ఆస్తులు, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్‌లో అన్ని కాలాలను పూర్తి చేయకపోతే అలాంటి నామినేషన్లను స్య్రూటినీలో తిరస్కరించాలని కలెక్టర్లకు ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల బయట నోటీసు బోర్డులో ప్రజలందరూ చూసేలా ఉంచాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలుతో 9న ఓటర్ల నమోదు కోసం నిర్వహించే బూత్‌స్థాయి ఆఫీసర్ల సమావేశాలపై కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ వినోద్ జుత్సి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భన్వర్‌లాల్‌తో సమీక్షించారు.