ఎన్నికల పరిశీలకులుగా 231మంది అధికారులు: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని రకాల పరిశీలకుల నియామకంపైనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భ న్వర్‌లాల్ దృష్టి సారించారు. షెడ్యూల్ విడుదలవ్వగానే ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల పరిశీలకులుగా మొత్తం 231 మంది అధికారులు రానున్నట్లు సోమవారం విలేకరులకు భన్వర్‌లాల్ తెలిపారు. ఒక్కో లోక్‌సభ స్థానానికి ఇద్దరేసి చొప్పున 42 లోక్‌సభ స్థానాలకు మొత్తం 84 మంది ఇతర రాష్ట్రాల అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు వివరించారు. అలాగే రెండేసి అసెంబ్లీ స్థానాలకు ఒకరు చొప్పున 294 అసెంబ్లీ స్థానాలకు 147 మంది ఇతర రాష్ట్రాల అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు.
వీరు ఎన్నికల నియమావళి అమలు తీరుతెన్నులతో పాటు, నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు నియమావళిని పాటించారా లేదా, ఎన్నికల వ్యయం నిబంధనలకు లోబడే ఉందా లేదా అనే విషయాలను చూస్తారని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్రం నుంచి 55 మంది ఐఏఎస్ అధికారులు వెళ్లనున్నారని ఆయన తెలిపారు. ఇదిలావుంటే.. ఎన్నికల నియామవళిని అమలు చేయడానికి ఒక్కో జిల్లాకు 15 మంది నోడల్ ఆఫీసర్ల చొప్పున 23 జిల్లాలకు 345 మంది నోడల్ ఆఫీసర్లతో బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.