భన్వర్‌లాల్ దంపతులకు స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు
నెల్లూరు (బృందావనం)/తిరుపతి అర్బన్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రానికి మంగళవారం ఆయన విచ్చేశారు. స్వామిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశమంతా ఒకేసారి, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు కమిషన్ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు.
ఒకేసారి ఎన్నికల విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం కాదన్నారు. ఈ అంశం పార్లమెంట్ లేదా కేంద్రం ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. నెల్లూరులో అతి పురాతనమైన ఆలయం తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భన్వర్‌లాల్ చెప్పారు. ఆయన వెంట ఆలయ పాలక మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్‌రెడ్డి ఉన్నారు.
మున్సిపాలిటీల్లో పకడ్బందీగా ఓటర్ల సవరణ
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పకడ్బందీగా ఓటర్ల సవరణ చేపట్టాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. మంగళవారం రాత్రి చిత్తూరు కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న ఆధ్వర్యంలో తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ ప్రక్రియను నవంబర్ 1న ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. గూగుల్ మ్యాప్‌లో పోలింగ్ కేంద్రాన్ని చూపేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment