వచ్చే పక్షం రోజుల్లోగా స్థానిక ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేయనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలి పారు.
* నెల రోజుల్లో షెడ్యూల్
* రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన త్వరలో
* ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పక్షం రోజుల్లోగా స్థానిక ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేయనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలి పారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని మంగళవారం తనను కలిసిన సాక్షి ప్రతినిధికి చెప్పారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ శాసనమండలిలో స్థాని క సంస్థల నియోజకవర్గాల సంఖ్యను మూడుకు పెంచాల్సి ఉందని, అలాగే ఏపీ శాసన మండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల సంఖ్యను మూడుకు తగ్గించాల్సి ఉందని, ఈ మార్పులను జిల్లాల జనాభా లెక్కల ప్రాతిపదికన కేంద్ర ఎన్నికల సంఘం పక్షం రోజుల్లో పూర్తి చేయనుందని వివరించారు.
అనంతరం నెల రోజుల్లోగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153కు పెంచేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 225కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలను చేపట్టిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన చేపట్టేందుకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
ఈ పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ఎన్నిల సంఘం ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు మొత్తం జనాభా లెక్కల గురించి కేంద్ర హోంశాఖ, రిజిస్ట్రార్ జనరల్‌ను సమాచారం కోరిందని తెలిపారు. ఇక సెప్టెంబర్ నెలలో ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారిని ఓటర్లుగా నమోదు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని, అయితే కేంద్రం ఒక ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకే నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు.