సాక్షి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈనెల 27 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ ఏర్పాట్లు చేపట్టింది. అటు ఎన్నికలు.. ఇటు పరీక్షల నిర్వహణ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించింది. పరీక్ష కేంద్రాలు.. పోలింగ్ కేంద్రాలు ఒకటే కావడం గందరగోళానికి తావిస్తోంది. జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న తొమ్మిది పురపాలక సంఘాల్లో ఆ బాధ్యతను ఉపాధ్యాయులే నిర్వహించాల్సి ఉంది.
జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదేసి మంది చొప్పున విధులకు హాజరవుతారు. ఇందుకోసం దాదాపు 3వేల మందికిపైగా ఉపాధ్యాయులు అవసరం. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తూనే.. పరీక్ష విధులకు సంబంధించి ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేందుకు, ఇతరత్రా పనులకు ఉపాధ్యాయులు ఒక రోజు సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలోని ఉపాధ్యాయులను పోలింగ్ అధికారులుగా, సహాయ పోలింగ్ అధికారులుగా, పోలింగ్ సిబ్బందిగా నియమిస్తారు.
అందుకోసం వీరు ఈనెల 28నే ఎన్నికల అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. 29న పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం.. 30న ఎన్నికలు నిర్వహించి, లెక్కింపు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. 30న ఆదివారం కావడంతో పురపాలక సంఘాల పరిధిలోని పదో తరగతి పరీక్షల కేంద్రాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నా ఇబ్బంది తలెత్తదు. అయితే పోలింగ్ కేంద్రాలను ఈనెల 27నే ఎన్నికల అధికారులకు అప్పగించాల్సి ఉండటం సమస్యకు కారణమవుతోంది. వాస్తవానికి పోలింగ్ కేంద్రాలు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తాయి. అధికారులు తరచూ వీటిని తనిఖీ చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతుంటారు. ఇదే సమయంలో గుర్తించిన పదో తరగతి పరీక్షల కేంద్రాల్లోనూ ఈనెల 25 నుంచే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు జంబ్లింగ్ విధానంలో జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. ఇటు పరీక్షల నిబంధనలు ఉల్లంఘించినా, అటు ఎన్నికల విధులను విస్మరించినా చట్టప్రకారం తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఎన్నికలు, పరీక్షల విధులు ఒక్కరే నిర్వర్తించాల్సి వస్తే పరిస్థితి ఏమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం
నిబంధనల ప్రకారం పరీక్ష, పోలింగ్ కేంద్రాలను మార్చే వీల్లేదు. సమస్య తీవ్రతను రాష్ట్ర కమిటీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. 29న జరిగే పరీక్షను వాయిదా వేసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన కీలక సమయంలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి రావడం ఇబ్బందికరం. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి.
- తులసిరెడ్డి, వైఎస్‌ఆర్‌టీఎఫ్, జిల్లా అధ్యక్షులు
ఎన్నికల ‘పరీక్ష’
Published Sun, Mar 9 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement