ఓ మహిళకు చెందిన కిలోన్నర బంగారు ఆభరణాలు మాయం
హైదరాబాద్: విశాఖపట్టణానికి చెందిన ఒక మహిళ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు వస్తుండగా ఆమెకు చెందిన 149 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం... విశాఖకు చెందిన జి.నాగకేశవేణు (52) అనే మహిళ తన మనవరాలి (బిడ్డ కుమార్తె)తో కలిసి గురువారం సాయంత్రం విశాఖలో బయలు దేరి శుక్రవారం దురంతో ఎక్స్‌ప్రెస్ (ఏటూకోచ్ బి40 వ బెర్త్)లో నగరానికి చేరుకుంది. ఆమె చందానగర్‌లో ఉంటున్న తన కుమార్తెతో కలిసి ఈ నెల15న హైదరాబాద్‌లోని మదీనాగూడలో జరగనున్న ఓ వివాహంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు, కుమార్తెకు చెందిన 149 తులాల బంగారు ఆభరణాలను వెంట తీసుకుని వచ్చింది. వాటిని తన హ్యాండ్ బ్యాగులో భద్రపరిచి తలకింద పెట్టుకుని నిద్రించింది. అర్థరాత్రి వేళ ఓ మారు చూసుకుంటే భద్రంగానే ఉన్న ఆమె హ్యాండ్‌బ్యాగ్ ఉదయం నాలుగు గంటల సమయంలో చూస్తే కనిపించలేదు. బ్యాగు గల్లంతైనట్టుగా గుర్తించిన బాధితురాలు డ్యూటీలో ఉన్న టీసీకి సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక ఇక్కడి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ఒక్క విజయవాడలో మాత్రమే హాల్టు ఉంది. అక్కడే ఆమె ఆభరణాలు పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఎసీ కోచ్‌లోకి టీసీ, బెడ్‌రోలర్ మినహా ఇతరులు అనుమతించరు. ఇలాంటి స్థితిలో ఆభరణాలు ఎలా గల్లంతయ్యాయన్న విషయమై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.