కౌన్సెలింగ్‌తో ఆగిన బాల్య వివాహం
అమృతలూరు: మిలటరీలో పనిచేస్తున్న ఓ యువకుడు వివాహ వయస్సు నిండని యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహాన్ని నిలిపివేయించారు. మండలంలోని పెదపూడికి చెందిన పెదపూడి రామారావు కుమారుడు భూపాల్ మిలటరీలో పనిచేస్తున్నాడు. జంపనికి చెందిన చొప్పర చినబాబు కుమార్తె (17)తో గురువారం వివాహం చేయటానికి నిశ్చయించారు.
ఈ నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి అన్నవరపు అనూరాధ పెదపూడి గ్రామానికి వెళ్ళి పెళ్ళి కుమారుడి తల్లి దండ్రులతో మాట్లాడారు. వివాహ వయస్సు దాటకుండా పెళ్ళి చేయడం చట్టరీత్యా నేరమని ఆమె హెచ్చరించారు. అంతేకాక ఉద్యోగరీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వరుని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు ప్రస్తుతం నిశ్చితార్ధం చేసుకుని మైనార్టీ తీరిన తరువాత వివాహం చేస్తామని అధికారిణి అనూరాధకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.