సాక్షి ప్రతినిధి, విజయనగరం : విపత్తును ఎవరేం చేయగలరు. తేరుకోవడానికి సమయం పడుతుంది. కష్టకాలంలో సహనం అవసరం. అధికారులు, ఉద్యోగులు మనుషులే కదా. పునరుద్ధరణకు నాలుగైదు రోజులు సమయం పడుతుంది. అంతవరకు ఇబ్బందులు తప్పవురూ.. ఇదీ తుపాను బీభత్సం తరువాత ప్రజల అభిప్రాయం పద కొండు రోజులైంది. పునరుద్ధరణ పనులు నత్త నడక కన్నా చెత్తగా సాగుతున్నాయి. పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. అధికారులు విఫలమయ్యారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్ లేక సతమతమవుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు కనిపిస్తే నిలదీస్తాం.
- ప్రస్తుతం ప్రజల నుంచి వినిపిస్తున్న ఆవేదనిది.
పరిస్థితి అధ్వానంగా తయారైంది. పట్టించుకున్న నాథుడు లేడని ప్రజలు విసుగెత్తిపోతున్నారు. అధికారులపై కత్తులు నూరుతున్నారు. ఎన్నుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారని ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. జిల్లాలోని పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ఇందులో అటు నేతలు, ఇటు అధికారుల వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపాయి.
అశోక్ పట్టించుకోలేదు.
జిల్లాలో కీలక నేత అశోక్ గజపతిరాజు. ఆయన ఇక్కడ ఉంటేనే పునరుద్ధరణ పనులు వేగంగా జరగడానికి అవకాశం ఉండేది. కానీ, ఆయన పట్టించుకోలేదు. చుట్టం చూపుగా వచ్చినట్టు తుపాను వెలిసిన తర్వాత వచ్చి, డీఆర్‌డీఏలో సమీక్ష చేసి, సీఎం పర్యటనలో పాల్గొని వెళ్లిపోయారు. ఆ తర్వాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన ఢిల్లీలో ఉన్నారు. గోడు చెప్పుకుందామంటే వినేవారు కరువయ్యారు. పార్టీ దశ, దిశ చూపే వారు లేకపోవడంతో నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా ఉండిపోయారు. ఇబ్బందులొచ్చినప్పుడు అశోక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పరిణామాలను నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
మృణాళిని పనితీరుపై ఆక్షేపణ
చల్‌తే...అన్నట్టుగా జిల్లా మంత్రి మృణాళిని కొనసాగుతున్నారని, ఫోన్‌లకు స్పందించడం లేదని ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఎవరికీ గట్టిగా చెప్పడం లేదు. అంతా సమర్థించుకునే ధోరణితో వెళ్తున్నారు. సీరియస్ ఉండటం లేదు. పునరుద్ధరణ పనుల్లో ఆశించిన పురోగతి కన్పించడం లేదు. ఇవే విషయాలను నిఘా సంస్థలు తమ నివేదికలో పొందుపరిచినట్టు భోగట్టా.
ఉపయోగం లేని మంత్రుల పర్యటనలు
తుపాను తీరం దాటాకా జిల్లాకు మంత్రులు క్యూ కట్టారు. ప్రొటోకాల్‌లో భాగంగా సంబంధిత శాఖ ఉద్యోగులు, అధికారులు వారి వెంట పరుగులు తీశారు. చాలావరకు వారి సేవల్లో తరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, అధికారులతో కాసేపు సమీక్షించి పత్రికలకు పరిమితమయ్యారు. అక్కడితో పని అయిపోయిందని తిరుగుముఖం పట్టారు. దీంతో ఫలితం లేకుండా పోయింది. ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుని, పునరుద్ధరణ పనులపై పర్యవేక్షణ చేసి ఉంటే జిల్లా ఈ పాటికే తేరుకునేది. విహార యాత్ర తరహాలో వచ్చి వెళ్లిపోవడంతో ప్రయోజనం లేకపోగా, పునరుద్ధరణకు ఆటంకంగా మారారు. వారి వెనుక ఫాలో అయిన ఉద్యోగులు, ఎస్కార్ట్‌ను పునరుద్ధరణ పనులకు కేటాయించినట్టయితే రోజుకు కనీసం రెండేసి గ్రామాలు పునరుద్ధరణకు నోచుకునేవి. ఈ పరిణామాలన్నీ నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.
మున్సిపాల్టీలో సమన్వయ లోపం
మున్సిపాల్టీల్లో సమన్వయం లోపించింది. ఎవరికి వారే అన్నట్టుగా ఎమ్మెల్యే మీసాల గీత, చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ సోమన్నారాయణ వ్యవహరించారు. సమష్టిగా పునరుద్ధరణ పనులు చేపట్టలేకపోయారు. దీంతో విజయనగరం పట్టణంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. పడిపోయిన చెట్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
తాగునీటిని ఆశించిన స్థాయిలో సరఫరా చేయలేకపోయారు. దీంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వ్యాధులు ప్రబలే పరిస్థితులు నెలకున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. అందుకు సాక్షి భూతంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని మంగళవారం అశోక్‌నగర్‌లో నిలదీసిన ఘటనే తీసుకోవచ్చు.
చొరవ చూపని గీత- డీల్ చేయలేకపోయిన చైర్మన్
మంత్రుల పర్యటన, తక్షణ సాయం పంపిణీ కార్యక్రమాలకే పరిమితమవ్వడం, చైర్మన్‌తో సమన్వయం లేక సమీక్షలకు దూరంగా ఉండటంతో పునరుద్ధరణ పనుల్లో ఎమ్మెల్యే మీసాల గీత చొరవ చూపలేకపోయారు.
చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కనీసం డీల్ చేయలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కమిషనర్ సోమన్నారాయణది అంతా షో వర్కేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాల్టీలో ఉన్న పరిణామాలన్నీ నిఘా సంస్థలు నివేదించడంతోనే మున్సిపల్ మంత్రి నారాయణ హుటాహుటిన జిల్లాకొచ్చి సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. ఆ సమీక్షలో కమిషనర్ సోమన్నారాయణ వ్యవహార తీరును ఆక్షేపించారు.
విద్యుత్ శాఖ లెక్కలూ తప్పే.
విద్యుత్ శాఖ ఇచ్చిన పునరుద్ధరణ లెక్కలు తప్పేనని నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. వాస్తవ పరిస్థితికి, విద్యుత్ శాఖ ఇచ్చిన రిపోర్టుకు ఎక్కడా పొంతన ఉండటం లేదని ఎత్తిచూపాయి. విద్యుత్ శాఖ ఇచ్చిన వివరాలను పరిశీలన చేసి మరో రిపోర్టు ఇవ్వాలని అదే నిఘా సంస్థలకు ప్రభుత్వం పురమాయించింది. ఆ మేరకు ప్రస్తుతం నిఘా సంస్థల సిబ్బంది మరోసారి గ్రామాల వారీగా విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల విద్యుత్ శాఖ డొల్లతనం బయటపడింది. బొండపల్లి, భోగాపురం, దత్తిరాజేరు, గంట్యాడ మండలాల్లో వాస్తవ పరిస్థితికి, విద్యుత్ శాఖ ఇచ్చిన రిపోర్టుకు పొంతన లేదని తెలిసింది.
తక్షణ సాయంలో
చిలక్కొట్టుడు
తుపాను ప్రభావిత మండలాల్లో పంపిణీ చేసిన తక్షణ సాయంలోనూ అక్రమార్కులు చిలక్కొట్టుడు కొట్టారు. పలుచోట్ల తక్షణ సాయం కింద వచ్చిన బియ్యం, ఆయిల్, పంచదారను డీలర్లు, టీడీపీ నాయకులు కలిపి తినేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఇంకొన్ని చోట్ల డీలర్లు తూకంలో కన్నం వేశారు. ఒక్కొక్క కార్డుదారుని వద్ద నుంచి మూడు నుంచి ఐదు కిలోల బియ్యాన్ని వెనకేసుకున్నట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లోనైతే బియ్యం తప్ప మరేది పంపిణీ చేయలేదని తెలిసింది. ఈ విషయాలన్నింటినీ నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తక్షణ సాయం పంపిణీపైనా నిఘా సిబ్బంది పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యారు. చాలా చోట్ల తక్షణ సాయం పక్కదారి పట్టినట్టు పరిశీలనలో తేలినట్టు తెలిసింది.
అంతా ష్లోవర్క్
Published Thu, Oct 23 2014 3:14 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM
Advertisement
Advertisement