Storm devastation
-
సిద్దిపేట, యాదాద్రిలో గాలివాన బీభత్సం
-
గాలివాన బీభత్సం
సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం సిద్దిపేట/ యాదాద్రి: సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో మంగళవారం రాత్రి.. బుధవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన రైతులను కడగండ్ల పాలు చేసింది. సిద్దిపేట జిల్లాలోని కొండపాక, తొగుట, కొమురవెల్లి, గజ్వేల్, హుస్నాబాద్, అక్కన్నపేట మండలా లలో వందలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. వరితోపాటు, కూరగాయల తోట లు భారీగా దెబ్బతిన్నాయి. గంటపాటు మేడి కాయల పరిమాణంలో వడగండ్లు పడ్డాయని రైతులు తెలిపారు. పొట్టదశలోని చేలపై రాళ్లు పడటంతో పొట్టలు పగిలిపోయి తాలుగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో రైతు కు 50 వేల వరకు నష్టం జరిగిందంటూ గుండెలవిసేలా విలపించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం వీచిన గాలి దుమారంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో కురిసిన వర్షానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రధానంగా కోతకు వచ్చిన వరికంకులు రాలిపోయాయి. 500 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో మామిడితోటలు దెబ్బతిన్నాయి. పిడుగుపడి వలిగొండ మండలం రెడ్లరేపాకలో 5 గొర్రెలు, అడ్డగూడూరులో 2 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భువనగిరి నూతన మార్కెట్లో వర్షపు వరద నీటికి రైతులు అమ్మకానికి తెచ్చిన సుమారు 500 బస్తాల ధాన్యం తడిసిపోయింది. యాదగిరి కొండపై ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. ప్రసాద విక్రయశాల, శాశ్వత కల్యాణం, చలువ పందిళ్ల పైకప్పులు లేచిపోయాయి. దేవస్థానం ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి గాయాలపాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. -
అంధకారంలో వందకుపైగా గ్రామాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్‌లో కలెక్టరేట్ ప్రధాన ద్వారం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నేలకొరి గారుు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ తెగిపోరుుంది. దీంతో జైనథ్ మండలంలో సుమారు 55 గ్రామాలు, బేల మండలంలో 65 గ్రామాలు, ఆదిలాబాద్ మండలంలో 70కిపైగా గ్రామా ల్లో అంధకారం నెలకొంది. తాంసి, తలమడుగు మండలాల్లో కూడా కొంత నష్టం వాటిల్లింది. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఆదివారం ఉదయం నుంచే పునరుద్ధరణ పనులు చేపట్టారు. జిల్లాలోని నార్నూర్ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు 17 ఎకరాల్లో అరటితోటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన 50 లక్షల రూపాయల విలువైన పంట నేలకొరిగింది. మెదక్ జిల్లాలో మహిళ దుర్మరణం జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారంరాత్రి ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. మన్నాపూర్‌లో ఓ ఇంటిపై ఉన్న కర్ర తలపై పడడంతో అమీనాబీ(35) అనే గృహిణి మరణించింది. ఏసప్ప, సిద్ధప్ప ఇళ్లపై భారీ మర్రి వృక్షం కూలడంతో వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. నిద్రలో నుంచి తేరుకున్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. -
చీకట్లోనే భాగ్యనగరం
- విద్యుత్, నీటి సరఫరా లేక జనం ఇబ్బందులు - బంజారాహిల్స్, ఆస్మాన్‌గడ్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌లో పరిస్థితి తీవ్రం - కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు.. రూ.కోటికి పైగా నష్టం చాలా ప్రాంతాల్లో.. ఈదురుగాలుల ధాటికి చెట్లకొమ్మలు విరిగి పడడంతో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని రోడ్ నంబర్ 1, 3, 12, 13 ప్రాంతాలు, జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45, 46తో పాటు ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, రాజేంద్రనగర్, కాటేదాన్, అగ్రికల్చర్ వర్సిటీ, పటాన్చెరు, మెహిదీపట్నం, శాంతిన గర్, హనుమాన్‌నగర్, వాటర్‌వర్క్ ఫీడర్, ఫతేదర్వాజా, షేక్‌పేట, ఫలక్‌నుమా, ఛత్రినాక, మొఘల్‌పుర, అత్తాపూర్, చాదర్‌ఘాట్, యాకూత్‌పుర, సంతోష్‌నగర్ ప్రాంతాల్లోని చాలా కాలనీల్లో ప్రజలంతా శనివారం రాత్రి కూడా చీకట్లోనే గడపాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా ఆదివారం మధ్యాహ్నానికి మెరుగుపడే అవకాశముంది. తాగేందుకు, స్నానానికి నీళ్లేవి? విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మంచినీటి నల్లాలు రాకపోగా, ఇళ్లలోని బోర్లూ పనిచేయలేదు. శనివారం ఉదయం నుంచి తాగేందుకు మంచినీరు కూడా లేక జనం ఇబ్బంది పడ్డారు. ఇక స్నానానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరికొంత మంది ఆఫీసులకు సెలవు పెట్టి ఇళ్లలో ఉండిపోయారు. లిఫ్టులు పనిచేయక అపార్ట్మెంట్లలో ఉండేవారు, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే దెబ్బతిన్న అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు సీఎండీ రఘుమారెడ్డి చెప్పడం గమనార్హం. తమ సిబ్బంది తీవ్రంగా శ్రమించి దెబ్బతిన్న ప్రధాన లైన్లన్నింటినీ ఇప్పటికే మరమ్మతు చేశారని పేర్కొన్నారు. చెట్లకొమ్మలు విరిగిపడడంతో చాలా ఇళ్ల సర్వీసు వైర్లు తెగాయని, వారు ఫిర్యాదు చేస్తే స్థానిక లైన్మెన్లు వచ్చి సరి చేస్తారని చెప్పారు. వీఐపీలకూ తప్పని తిప్పలు.. గాలివాన బీభత్సానికి వీఐపీలు, ప్రముఖులకూ తిప్పలు తప్పలేదు. వీఐపీలు, సినీతారలు నివ సించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, ఖైరతాబాద్ల్లోనూ విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో శుక్ర, శనివారాల్లో చాలా మంది ప్రముఖులు స్వయంగా విద్యుత్, జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు, రహదారులపై పడిన చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జీహెచ్ఎంసీ, డిస్కంల ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద ఆయా ప్రాంతాల్లో పర్యటించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. వెల్లువెత్తిన ఫిర్యాదులు గాలివాన బీభత్సం సహాయక చర్యల కోసం జీెహ చ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెట్ల కొమ్మలు విరిగిపడటంపై 266 ఫిర్యాదులు రాగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై 176, విద్యుత్ స్తంభాలు పడిపోవడంపై 47, మురుగునీటి నిల్వ, డ్రైనే జీ పొంగిపొర్లడంపై 16, చెత్త తరలించకపోవడంపై 9, రోడ్డు డ్యామేజీ, మ్యాన్‌హోల్‌లు, గోడ కూలిపోవడం వంటి మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 564 ఫిర్యాదులు రాగా.. అందులో శుక్రవారం ఒక్కరోజే 465 ఫిర్యాదులు వచ్చాయి. గవర్నర్ నరసింహన్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఫోన్లు చేశారు. హోర్డింగ్ యజమానిపై కేసు గాలి దుమారం ధాటికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతంలోని నెక్సా షోరూం ముందు కూలిపోయిన యూనిపోల్ హోర్డింగ్ యజమాని, కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ కూలడంతో దాని కిందపడి పది వాహనాలు ధ్వంసమయ్యాయి. అందులో ఓ వాహన యజమాని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులకు కేటీఆర్ అభినందన గాలివాన బీభత్సాన్ని సరిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులంతా బాగా పనిచేశారని విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అభినందించారు. పలు మార్గాల ద్వారా అధికారులు బాగా పనిచేశారని తనకు సమాచారం అందిందని, ఇంకా ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈదురుగాలులు సృష్టించిన విలయంతో హైదరాబాద్ అంధకారంలో మునిగిపోయింది.. శుక్రవారం సాయంత్రం జడివాన ధాటికి అతలాకుతలమైన నగరం ఇంకా తేరుకోలేదు.. చాలా ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, నీటి సరఫరా లేకపోవడంతో జనం తీవ్రంగా అవస్థలు పడ్డారు. తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ నీరు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయిన అనేక మంది బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హోర్డింగ్‌లు, చెట్లకొమ్మలను తొలగించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అరగంట వర్షం.. రూ.కోటికిపైగా నష్టం ఈదురు గాలులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 33 కేవీ స్తంభాలు 66, 11 కేవీ స్తంభాలు 372, ఎల్టీ స్తంభాలు 692, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 66 దెబ్బతిన్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 33 కేవీ స్తంభాలు 60, 11 కేవీ స్తంభాలు 211, ఎల్టీ స్తంభాలు 332, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 20 ధ్వంసమైనట్లు లెక్క తేలుతోంది. దీంతో సంస్థకు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆనంద్‌నగర్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, ఖైరతాబాద్, ఇబ్రహీంబాగ్, రాజేంద్రనగర్, అజామాబాద్ డివిజన్ల పరిధిలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. 2,100 మంది ఇంజనీర్లు, కార్మికులు నిర్విరామంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ‘కంట్రోల్ రూమ్’కు గవర్నర్ ప్రశంసలు గవర్నర్ నరసింహన్ జీహెచ్ఎంసీ అత్యవసర కంట్రోల్ రూమ్ పనితీరును ప్రశంసించారు. ఈ హెల్ప్‌లైన్‌కు ఆయన ఓ సామాన్య పౌరుడిలా ఫోన్ చేశారు. స్పందన బాగుండటంతో కమిషనర్‌ను అభినందించారు. శుక్రవారం జడివాన కురిసిన తర్వాత.. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 100కు గవర్నర్ నరసింహన్ తన సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేశారు. ఈ కాల్‌ను స్వీకరించిన సిబ్బంది... ఫోన్ చేసినవారి పేరు, సమస్య ఏమిటి, ఎక్కడ తదితర వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. నరసింహన్ తాను గవర్నర్‌నని చెప్పకుండా సాధారణంగానే పేరు చెప్పి, హైటెక్ సిటీ ఏరియాలో చెట్టు కూలిపోయిందని ఫిర్యాదు చేశారు. తర్వాత ఐదు నిమిషాల్లో గవర్నర్ సెల్‌ఫోన్ నంబర్‌కు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వెళ్లింది. ఫిర్యాదు చేసిన విషయం నిజమా, కాదా అనే అంశాన్ని వారు అడిగి నిర్ధారణ చేసుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఇలా ఫిర్యాదుపై వేగంగా స్పందించిన తీరును గవర్నర్ ప్రశంసించారు. శనివారం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డికి ఈ విషయం వివరించి కంట్రోల్‌రూమ్ పనితీరును అభినందించారు. -
ఉరుములు మెరుపులు
♦ స్తంభించిన పౌరజీవనం ♦ భెల్‌లో జనం బెంబేలు ♦ నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ♦ ఎగిరిపడ్డ పైకప్పులు ♦ అంధకారంలో గ్రామాలు గాలివాన.. మెతుకుసీమను అతలాకుతలం చేసింది. పెను బీభత్సాన్ని సృష్టించింది. వేర్వేరు చోట్ల పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నారాయణఖేడ్, నర్సాపూర్, దుబ్బాక, పటాన్చెరు నియోజకవర్గాలో భారీ నష్టం జరిగింది. గాలివానకు భెల్ పట్టణం స్తంభించింది. వందలాది చెట్లు విరిగిపడ్డాయి. ఒకవైపు చెట్లు, మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతుంటే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యుతు సరాఫరా నిలిచిపోయింది. పుల్కల్ మండలం బస్వాపూర్‌కి చెందిన గొల్ల దుర్గయ్య (25), సిద్దిపేట మండలం బక్రిచెప్యాలకు చెందిన కుర్మ సత్తయ్య, సత్తవ్వల కుమార్తె కుర్మ సౌజన్య (13) పిడుగుపాటుకు బలయ్యారు. కొత్త పెళ్లికొడుకును మింగిన పిడుగు పుల్కల్: పిడుగుపాటుకు నవ వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బస్వాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బస్వాపూర్‌కు చెందిన గొల్ల దుర్గయ్య(25) ఎప్పటిలాగే గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోకూడిన వర్షం వచ్చింది. దుర్గయ్య వెంటనే వేప చెట్టు కిందకు వెళ్లే ప్రయత్నం చేయగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గయ్యకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. తమ ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ⇔ సిద్దిపేటలో గాలివాన బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపోయాయి. చెట్లు విరగ్గా, గోడలు కూలాయి. కరీంనగర్ రోడ్డులో దుర్గా దాబా నేలమట్టమైంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌తోపాటు పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు. రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ⇔ శివ్వంపేట మండలం శివ్వంపేట, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్, పిల్లుట్ల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. కొత్తపేటలో ధనారెడ్డికి చెందిన పౌల్ట్రీఫారం ధ్వంసమైంది. ఏడువేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.15 లక్షల నష్టం జరిగింది. ⇔ జిన్నారంలో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. మాధవరం, ఊట్ల, జిన్నారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ⇔ కల్హేర్, మార్డి, బీబీపేట, కృష్ణాపూర్ తదితర చోట్ల గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పౌల్ట్రీఫారాల రేకులు ఎగిరిపడ్డాయి. ⇔ పటాన్‌చెరుతోపాటు రామచంద్రాపురం, భెల్‌లో భారీ నష్టం జరిగింది. భారీ ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భెల్ టౌన్షిప్ అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి పదిరోజులైనా పడుతుందని కార్మికులు అంటున్నారు. ⇔ సంగారెడ్డిలో మోస్తరు వర్షం కురిసింది. ⇔ మెదక్ పట్టణంలో వర్షం ఊరించి ఉసూరుమన్పించింది. కారు మబ్బులు కమ్ముకున్నా, ఉరిమినా వర్షం కురవకపోవడంతో రైతులు నిరాశ చెందారు. గాలివానతో లబోదిబో... హత్నూర: మండలంలోని మూడు గ్రామాలు, నాలుగు తండాల్లో గాలివాన విధ్వంసాన్ని సృష్టించింది. నాగారం, కొడిప్యాక, కొత్తగూడెం గ్రామాలతోపాటు చింతల్‌చెరువు పంచాయతీలోని గోపాల్ తండా, కిషన్‌తండా, కిమ్యాతండా, ఎల్లమ్మ గూడెం పంచాయతీ పరిధిలోని రేన్ల గూడెం అతలాకుతలమయ్యాయి. దాదాపు 80 వరకు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు దెబ్బతిన్న కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. దాదాపు వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌సరఫరా లేకపోవడంతో సదరు గ్రామాలు, తండాలు అంధకారంలో ఉండిపోయాయి. పెద్ద ఎత్తున చెట్లు కూలాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోపాల్ గిరిజన తండాలో లకావత్ శ్రీను పూరిల్లు కూలడంతో కుటుంబీకులు శిథిలా నుంచి బయటకు పరుగులు తీశారు. కిషన్ తండాకు చెందిన రోహుల నాయక్ ఇంటిపైకప్పు రేకులతోపాటు గోడలు కూలి ఇంట్లో ఉన్నవారిపై పడడంతో గాయాలయ్యాయి. గోపాల్ తండాకు చెందిన పాండు, దేవుల, డాక్య, సుభాష్, కిషన్, నర్సింగ్, గేమ్‌సింగ్, గోపాల్‌నాయక్, నాన్య, రమేష్నాయక్ల ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కిషన్తండాకు చెందిన సామ్య, బూల్యాతోపాటు మరోపదిమంది ఇళ్లు కూలిపోయాయి. కిమ్యా తండాకు చెందిన నర్సింగ్, శంకర్, కిమ్యానాయక్, రాజునాయక్‌తోపాటు పలువురి ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. మూడు తండాలలో గిరిజనులు ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులు సామగ్రితో బయటకు వచ్చేశారు. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి ఇళ్లు, బైక్‌లపై పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొత్తగూడెం, నాగారం, కొడిపాకలో సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతోపాటు 60ళ్ల వరకు రేకులు, పెంకుటిళ్ళ పైకప్పులు ధ్వంసమయ్యాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్దపెద్ద చెట్లు వడ్డేపల్లి, నాగారం, కొత్తగూడెం రహదారులపై అడ్డంగా పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.గిరిజన తండాలో పైకప్పు రేకులు కూలడంతో శారద, కమల, రాధమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. ఆయా గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పర్యటించనున్నారు. పసిగుడ్డుతో వీధిన పడ్డ బాలింత నర్సాపూర్ రూరల్: గూడెంగడ్డకు చెందిన స్వరూప అనే మహిళ పూరింట్లోకి నీరు చేరింది. దీంతో ఆమె కూతురైన బాలింత నాగమణి పసిగుడ్డుతోపాటు సామాన్లతో బయటకు వచ్చింది. ఆశ్రయం కోసం ఎదురు చూస్తోంది. పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతి నత్నాయపల్లిలో పిడుగుపాటుకు నీలి లక్ష్మీనారాయణకు చెందిన నాలుగు మేకలు మృత్యువాత పడ్డాయి. అడవిలో మేకలు మేపుకొని వస్తుండగా వర్షం పడుతుండడంతో మేకల మందను ఓ చెట్టుకింద నిలిపాడు. పిడుగు శబ్దం రాగానే లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరుగు తీయగా నాలుగు మేకలు అక్కడికక్కడే మృతిచెందగా మరో నాలుగు మేకల పరిస్థితి విషమంగా ఉంది. లింగాపూర్‌లో హన్మంత్‌కు చెందిన పౌల్ట్రీఫారం దెబ్బతింది. దాదాపు 5వేల కోడిపిల్లలు చనిపోగా రూ.3లక్షల వరకు నష్టం జరిగింది. బాలికను బలిగొన్న పిడుగు సిద్దిపేట జోన్: పిడుగు పాటుకు ఓ బాలిక మృతి చెందింది. వెంట ఉన్న కుక్క పిల్ల సైతం మాడిమసైంది. ఈ ఘటన మండలంలోని బక్రిచెప్యాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మ సత్త య్య, సత్తవ్వ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. శుక్రవారం పొలంలో ఎరువు చల్లేందుకు తల్లిదండ్రులతో కలిసి అన్నాచెల్లెలు వెళ్లారు. సాయంత్రం వేళ వాతావరణంలో మార్పును గమనించిన సౌజన్య(13) ఇంటికి వెళ్దామని అన్నయ్యతో చెప్పింది. తాను పశువులను కట్టేసి వస్తానని చెప్పడంతో సౌజన్య చెరువు వెంట ఇంటిముఖం పట్టింది. అప్పటికే ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. తనతోపాటు వచ్చిన కుక్కపిల్లతో కలిసి చెరువు గట్టున ఉన్న తుమ్మచెట్టు కిందకు చేరింది. పిడుగు పడడంతో సౌజన్య అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుక్కపిల్ల సైతం మాడి మసైంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. తరలివచ్చిన మంత్రి... సిద్దిపేటలో రోజంతా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌కు బయలుదేరారు. పిడుగుపాటు తో బాలిక మృతి చెందిన విషయం తెలిసి వెంటనే వెనుదిరి గారు. బక్రిచెప్యాలకు వెళ్లి మృతురాలి కుటుం బీకులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వారి భరోసా ఇచ్చారు. -
గాలివాన బీభత్సం
కరీంనగర్ అగ్రికల్చర్: కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పంట లకు, ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్‌యార్డులలో ఆరబోసిన ధాన్యం తడిసిపోరుుంది. జగిత్యాల మండలం చల్గల్ మార్కెట్ యూర్డుకు 50వేల క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి రాగా.. సుమారు 10వేల క్వింటాళ్లు తడిసిపోరుుంది. ఈదురుగాలులకు మామిడితోటల్లో కాయలు నేలరాలిపోరుు రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కరీంనగర్లో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో దాదాపు ఐదు గంటలపాటు అంధకారం నెలకొంది. గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో పిడుగుపాటుతో అగ్గతి నారాయణ(56) అనే గొర్లకాపరి మరణించాడు. అలాగే, మల్లాపూర్ మండలం గొరెపల్లిలో పిడుగు పాటుకు బోడ సూక్యా నాయక్ మృతి చెందాడు. 32 గొర్రెలు కూడా మృతి చెందాయి. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్‌షాక్‌తో వెంకటేశ్వర్‌రెడ్డి అనే రైతు మృతి చెందాడు. -
అంతా ష్లోవర్క్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విపత్తును ఎవరేం చేయగలరు. తేరుకోవడానికి సమయం పడుతుంది. కష్టకాలంలో సహనం అవసరం. అధికారులు, ఉద్యోగులు మనుషులే కదా. పునరుద్ధరణకు నాలుగైదు రోజులు సమయం పడుతుంది. అంతవరకు ఇబ్బందులు తప్పవురూ.. ఇదీ తుపాను బీభత్సం తరువాత ప్రజల అభిప్రాయం పద కొండు రోజులైంది. పునరుద్ధరణ పనులు నత్త నడక కన్నా చెత్తగా సాగుతున్నాయి. పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. అధికారులు విఫలమయ్యారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్ లేక సతమతమవుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు కనిపిస్తే నిలదీస్తాం. - ప్రస్తుతం ప్రజల నుంచి వినిపిస్తున్న ఆవేదనిది. పరిస్థితి అధ్వానంగా తయారైంది. పట్టించుకున్న నాథుడు లేడని ప్రజలు విసుగెత్తిపోతున్నారు. అధికారులపై కత్తులు నూరుతున్నారు. ఎన్నుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారని ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. జిల్లాలోని పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ఇందులో అటు నేతలు, ఇటు అధికారుల వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపాయి. అశోక్ పట్టించుకోలేదు. జిల్లాలో కీలక నేత అశోక్ గజపతిరాజు. ఆయన ఇక్కడ ఉంటేనే పునరుద్ధరణ పనులు వేగంగా జరగడానికి అవకాశం ఉండేది. కానీ, ఆయన పట్టించుకోలేదు. చుట్టం చూపుగా వచ్చినట్టు తుపాను వెలిసిన తర్వాత వచ్చి, డీఆర్డీఏలో సమీక్ష చేసి, సీఎం పర్యటనలో పాల్గొని వెళ్లిపోయారు. ఆ తర్వాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన ఢిల్లీలో ఉన్నారు. గోడు చెప్పుకుందామంటే వినేవారు కరువయ్యారు. పార్టీ దశ, దిశ చూపే వారు లేకపోవడంతో నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా ఉండిపోయారు. ఇబ్బందులొచ్చినప్పుడు అశోక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పరిణామాలను నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. మృణాళిని పనితీరుపై ఆక్షేపణ చల్తే...అన్నట్టుగా జిల్లా మంత్రి మృణాళిని కొనసాగుతున్నారని, ఫోన్లకు స్పందించడం లేదని ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఎవరికీ గట్టిగా చెప్పడం లేదు. అంతా సమర్థించుకునే ధోరణితో వెళ్తున్నారు. సీరియస్ ఉండటం లేదు. పునరుద్ధరణ పనుల్లో ఆశించిన పురోగతి కన్పించడం లేదు. ఇవే విషయాలను నిఘా సంస్థలు తమ నివేదికలో పొందుపరిచినట్టు భోగట్టా. ఉపయోగం లేని మంత్రుల పర్యటనలు తుపాను తీరం దాటాకా జిల్లాకు మంత్రులు క్యూ కట్టారు. ప్రొటోకాల్‌లో భాగంగా సంబంధిత శాఖ ఉద్యోగులు, అధికారులు వారి వెంట పరుగులు తీశారు. చాలావరకు వారి సేవల్లో తరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, అధికారులతో కాసేపు సమీక్షించి పత్రికలకు పరిమితమయ్యారు. అక్కడితో పని అయిపోయిందని తిరుగుముఖం పట్టారు. దీంతో ఫలితం లేకుండా పోయింది. ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుని, పునరుద్ధరణ పనులపై పర్యవేక్షణ చేసి ఉంటే జిల్లా ఈ పాటికే తేరుకునేది. విహార యాత్ర తరహాలో వచ్చి వెళ్లిపోవడంతో ప్రయోజనం లేకపోగా, పునరుద్ధరణకు ఆటంకంగా మారారు. వారి వెనుక ఫాలో అయిన ఉద్యోగులు, ఎస్కార్ట్‌ను పునరుద్ధరణ పనులకు కేటాయించినట్టయితే రోజుకు కనీసం రెండేసి గ్రామాలు పునరుద్ధరణకు నోచుకునేవి. ఈ పరిణామాలన్నీ నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. మున్సిపాల్టీలో సమన్వయ లోపం మున్సిపాల్టీల్లో సమన్వయం లోపించింది. ఎవరికి వారే అన్నట్టుగా ఎమ్మెల్యే మీసాల గీత, చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ సోమన్నారాయణ వ్యవహరించారు. సమష్టిగా పునరుద్ధరణ పనులు చేపట్టలేకపోయారు. దీంతో విజయనగరం పట్టణంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. పడిపోయిన చెట్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. తాగునీటిని ఆశించిన స్థాయిలో సరఫరా చేయలేకపోయారు. దీంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వ్యాధులు ప్రబలే పరిస్థితులు నెలకున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. అందుకు సాక్షి భూతంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని మంగళవారం అశోక్‌నగర్‌లో నిలదీసిన ఘటనే తీసుకోవచ్చు. చొరవ చూపని గీత- డీల్ చేయలేకపోయిన చైర్మన్ మంత్రుల పర్యటన, తక్షణ సాయం పంపిణీ కార్యక్రమాలకే పరిమితమవ్వడం, చైర్మన్‌తో సమన్వయం లేక సమీక్షలకు దూరంగా ఉండటంతో పునరుద్ధరణ పనుల్లో ఎమ్మెల్యే మీసాల గీత చొరవ చూపలేకపోయారు. చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కనీసం డీల్ చేయలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కమిషనర్ సోమన్నారాయణది అంతా షో వర్కేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాల్టీలో ఉన్న పరిణామాలన్నీ నిఘా సంస్థలు నివేదించడంతోనే మున్సిపల్ మంత్రి నారాయణ హుటాహుటిన జిల్లాకొచ్చి సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. ఆ సమీక్షలో కమిషనర్ సోమన్నారాయణ వ్యవహార తీరును ఆక్షేపించారు. విద్యుత్ శాఖ లెక్కలూ తప్పే. విద్యుత్ శాఖ ఇచ్చిన పునరుద్ధరణ లెక్కలు తప్పేనని నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. వాస్తవ పరిస్థితికి, విద్యుత్ శాఖ ఇచ్చిన రిపోర్టుకు ఎక్కడా పొంతన ఉండటం లేదని ఎత్తిచూపాయి. విద్యుత్ శాఖ ఇచ్చిన వివరాలను పరిశీలన చేసి మరో రిపోర్టు ఇవ్వాలని అదే నిఘా సంస్థలకు ప్రభుత్వం పురమాయించింది. ఆ మేరకు ప్రస్తుతం నిఘా సంస్థల సిబ్బంది మరోసారి గ్రామాల వారీగా విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల విద్యుత్ శాఖ డొల్లతనం బయటపడింది. బొండపల్లి, భోగాపురం, దత్తిరాజేరు, గంట్యాడ మండలాల్లో వాస్తవ పరిస్థితికి, విద్యుత్ శాఖ ఇచ్చిన రిపోర్టుకు పొంతన లేదని తెలిసింది. తక్షణ సాయంలో చిలక్కొట్టుడు తుపాను ప్రభావిత మండలాల్లో పంపిణీ చేసిన తక్షణ సాయంలోనూ అక్రమార్కులు చిలక్కొట్టుడు కొట్టారు. పలుచోట్ల తక్షణ సాయం కింద వచ్చిన బియ్యం, ఆయిల్, పంచదారను డీలర్లు, టీడీపీ నాయకులు కలిపి తినేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఇంకొన్ని చోట్ల డీలర్లు తూకంలో కన్నం వేశారు. ఒక్కొక్క కార్డుదారుని వద్ద నుంచి మూడు నుంచి ఐదు కిలోల బియ్యాన్ని వెనకేసుకున్నట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లోనైతే బియ్యం తప్ప మరేది పంపిణీ చేయలేదని తెలిసింది. ఈ విషయాలన్నింటినీ నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తక్షణ సాయం పంపిణీపైనా నిఘా సిబ్బంది పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యారు. చాలా చోట్ల తక్షణ సాయం పక్కదారి పట్టినట్టు పరిశీలనలో తేలినట్టు తెలిసింది.