చీకట్లోనే భాగ్యనగరం
- విద్యుత్, నీటి సరఫరా లేక జనం ఇబ్బందులు
- బంజారాహిల్స్, ఆస్మాన్‌గడ్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌లో పరిస్థితి తీవ్రం
- కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు.. రూ.కోటికి పైగా నష్టం
చాలా ప్రాంతాల్లో..
ఈదురుగాలుల ధాటికి చెట్లకొమ్మలు విరిగి పడడంతో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని రోడ్ నంబర్ 1, 3, 12, 13 ప్రాంతాలు, జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45, 46తో పాటు ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, రాజేంద్రనగర్, కాటేదాన్, అగ్రికల్చర్ వర్సిటీ, పటాన్‌చెరు, మెహిదీపట్నం, శాంతిన గర్, హనుమాన్‌నగర్, వాటర్‌వర్క్ ఫీడర్, ఫతేదర్వాజా, షేక్‌పేట, ఫలక్‌నుమా, ఛత్రినాక, మొఘల్‌పుర, అత్తాపూర్, చాదర్‌ఘాట్, యాకూత్‌పుర, సంతోష్‌నగర్ ప్రాంతాల్లోని చాలా కాలనీల్లో ప్రజలంతా శనివారం రాత్రి కూడా చీకట్లోనే గడపాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా ఆదివారం మధ్యాహ్నానికి మెరుగుపడే అవకాశముంది.
తాగేందుకు, స్నానానికి నీళ్లేవి?
విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మంచినీటి నల్లాలు రాకపోగా, ఇళ్లలోని బోర్లూ పనిచేయలేదు. శనివారం ఉదయం నుంచి తాగేందుకు మంచినీరు కూడా లేక జనం ఇబ్బంది పడ్డారు. ఇక స్నానానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరికొంత మంది ఆఫీసులకు సెలవు పెట్టి ఇళ్లలో ఉండిపోయారు. లిఫ్టులు పనిచేయక అపార్ట్‌మెంట్లలో ఉండేవారు, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే దెబ్బతిన్న అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు సీఎండీ రఘుమారెడ్డి చెప్పడం గమనార్హం. తమ సిబ్బంది తీవ్రంగా శ్రమించి దెబ్బతిన్న ప్రధాన లైన్లన్నింటినీ ఇప్పటికే మరమ్మతు చేశారని పేర్కొన్నారు. చెట్లకొమ్మలు విరిగిపడడంతో చాలా ఇళ్ల సర్వీసు వైర్లు తెగాయని, వారు ఫిర్యాదు చేస్తే స్థానిక లైన్‌మెన్లు వచ్చి సరి చేస్తారని చెప్పారు.
వీఐపీలకూ తప్పని తిప్పలు..
గాలివాన బీభత్సానికి వీఐపీలు, ప్రముఖులకూ తిప్పలు తప్పలేదు. వీఐపీలు, సినీతారలు నివ సించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, ఖైరతాబాద్‌ల్లోనూ విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో శుక్ర, శనివారాల్లో చాలా మంది ప్రముఖులు స్వయంగా విద్యుత్, జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు, రహదారులపై పడిన చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ, డిస్కంల ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద ఆయా ప్రాంతాల్లో పర్యటించి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
వెల్లువెత్తిన ఫిర్యాదులు
గాలివాన బీభత్సం సహాయక చర్యల కోసం జీెహ చ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెట్ల కొమ్మలు విరిగిపడటంపై 266 ఫిర్యాదులు రాగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై 176, విద్యుత్ స్తంభాలు పడిపోవడంపై 47, మురుగునీటి నిల్వ, డ్రైనే జీ పొంగిపొర్లడంపై 16, చెత్త తరలించకపోవడంపై 9, రోడ్డు డ్యామేజీ, మ్యాన్‌హోల్‌లు, గోడ కూలిపోవడం వంటి మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 564 ఫిర్యాదులు రాగా.. అందులో శుక్రవారం ఒక్కరోజే 465 ఫిర్యాదులు వచ్చాయి. గవర్నర్ నరసింహన్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఫోన్లు చేశారు.
హోర్డింగ్ యజమానిపై కేసు
గాలి దుమారం ధాటికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతంలోని నెక్సా షోరూం ముందు కూలిపోయిన యూనిపోల్ హోర్డింగ్ యజమాని, కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ కూలడంతో దాని కిందపడి పది వాహనాలు ధ్వంసమయ్యాయి. అందులో ఓ వాహన యజమాని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారులకు కేటీఆర్ అభినందన
గాలివాన బీభత్సాన్ని సరిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులంతా బాగా పనిచేశారని విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అభినందించారు. పలు మార్గాల ద్వారా అధికారులు బాగా పనిచేశారని తనకు సమాచారం అందిందని, ఇంకా ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఈదురుగాలులు సృష్టించిన విలయంతో హైదరాబాద్ అంధకారంలో మునిగిపోయింది.. శుక్రవారం సాయంత్రం జడివాన ధాటికి అతలాకుతలమైన నగరం ఇంకా తేరుకోలేదు.. చాలా ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, నీటి సరఫరా లేకపోవడంతో జనం తీవ్రంగా అవస్థలు పడ్డారు. తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ నీరు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయిన అనేక మంది బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హోర్డింగ్‌లు, చెట్లకొమ్మలను తొలగించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
అరగంట వర్షం.. రూ.కోటికిపైగా నష్టం
ఈదురు గాలులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 33 కేవీ స్తంభాలు 66, 11 కేవీ స్తంభాలు 372, ఎల్టీ స్తంభాలు 692, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 66 దెబ్బతిన్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 33 కేవీ స్తంభాలు 60, 11 కేవీ స్తంభాలు 211, ఎల్టీ స్తంభాలు 332, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 20 ధ్వంసమైనట్లు లెక్క తేలుతోంది. దీంతో సంస్థకు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆనంద్‌నగర్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, ఖైరతాబాద్, ఇబ్రహీంబాగ్, రాజేంద్రనగర్, అజామాబాద్ డివిజన్ల పరిధిలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. 2,100 మంది ఇంజనీర్లు, కార్మికులు నిర్విరామంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
‘కంట్రోల్ రూమ్’కు గవర్నర్ ప్రశంసలు
గవర్నర్ నరసింహన్ జీహెచ్‌ఎంసీ అత్యవసర కంట్రోల్ రూమ్ పనితీరును ప్రశంసించారు. ఈ హెల్ప్‌లైన్‌కు ఆయన ఓ సామాన్య పౌరుడిలా ఫోన్ చేశారు. స్పందన బాగుండటంతో కమిషనర్‌ను అభినందించారు. శుక్రవారం జడివాన కురిసిన తర్వాత.. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 100కు గవర్నర్ నరసింహన్ తన సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేశారు. ఈ కాల్‌ను స్వీకరించిన సిబ్బంది... ఫోన్ చేసినవారి పేరు, సమస్య ఏమిటి, ఎక్కడ తదితర వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు.
నరసింహన్ తాను గవర్నర్‌నని చెప్పకుండా సాధారణంగానే పేరు చెప్పి, హైటెక్ సిటీ ఏరియాలో చెట్టు కూలిపోయిందని ఫిర్యాదు చేశారు. తర్వాత ఐదు నిమిషాల్లో గవర్నర్ సెల్‌ఫోన్ నంబర్‌కు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వెళ్లింది. ఫిర్యాదు చేసిన విషయం నిజమా, కాదా అనే అంశాన్ని వారు అడిగి నిర్ధారణ చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఇలా ఫిర్యాదుపై వేగంగా స్పందించిన తీరును గవర్నర్ ప్రశంసించారు. శనివారం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డికి ఈ విషయం వివరించి కంట్రోల్‌రూమ్ పనితీరును అభినందించారు.