అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని నగర, పురపాలక సంస్థల్లో సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్)తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాలతో కనీసం 50 శాతం విద్యుత్ బిల్లులు తగ్గేలా ఒప్పందంలో నిబంధన పెట్టాలన్నారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఈఈఎస్‌ఎల్‌ను కోరాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై మంగళవారం సచివాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, శాఖ సంచాలకులు డి.దానకిశోర్, ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తదితరులతో కేటీఆర్ సమీక్షించారు. ఇంటింటికీ రెండు ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన నగర పంచాయతీల్లో ఇప్పటివరకు 4.5 లక్షల ఎల్‌ఈడీలను పంపిణీ చేశామని సౌరభ్‌కుమార్ తెలపగా.. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ పరిధిలో 4.5 లక్షల ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.
రాజధానిలో పైలట్ ప్రాజెక్టు ద్వారా సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సంక్రాంతి నాటికి నగరం అంతటా ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సౌరభ్‌కుమార్ తెలిపారు. మెట్రో వాటర్ వర్క్స్, సివరేజీ బోర్డు నగరంలో నీటి సరఫరా కోసం అధునాతన ఎనర్జీ ఎఫీషియంట్ పంపు సెట్లను వినియోగించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
రాష్ట్రమంతటా ఎల్‌ఈడీ కాంతులు
Published Wed, Oct 5 2016 2:11 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement