కరెంటు, నీటి సమస్యలకు ప్రాధాన్యం
►మూడు నెలల్లో చార్మినార్ కాలిబాట పథకం పూర్తి
►మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: పాతబస్తీలో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం పాతబస్తీలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ వేసవిలో నెలకొన్న మంచినీరు, విద్యుత్ సమస్యను యుద్ధప్రాతిపదికన అధిగమించేందుకు వారం రోజుల్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. పాతబస్తీలో మరిన్ని మంచినీటి రిజర్వాయర్లు నిర్మిస్తామని, సీవరేజ్ పైప్‌లైన్ ఆధునీకరణ పనులపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, చార్మినార్ కాలిబాట పథకం పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
గోల్డెన్ సీటీగా తీర్చిదిద్దుతాం
పాతనగరాన్ని గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడించారు. పాత బస్తీ అన్ని విధాలుగా అభివృద్ధి పర్చడం ఖాయమన్నారు. నిజమైన హైదరాబాద్ నగరం పాతబస్తీ అని ఆయన అభివర్ణించారు. ఆంధ్ర నాయకుల పాలనలో పాతబస్తీ అభివద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన షాదీ ముబారక్ పథకం పాతబస్తీలోని పేద ముస్లింలకు వరంగా మారిం దన్నారు. మొఘల్‌పురాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం స్థానికులకు ఎం తో వెసులుబాటుగా ఉంటుందన్నారు.
మినీ బస్సులను తిప్పుతాం
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో 1400 పెద్ద బస్సులు, 230 మినీ బస్సులు కొనుగోలుు చేయనునట్లు రాష్ట్ర రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. మినీ బస్సులను అన్ని బస్తీలకు తిప్పనున్నామని చెప్పారు.
రిజర్వేషన్లు హర్షదాయకం
తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరమని హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఫలక్‌నుమాలోని 10–12 ఎకరాల పోలీస్ శాఖ స్థలాన్ని హౌజింగ్ బోర్డుకు తీసుకొని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజకవర్గాలలోని పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని, ఫలక్‌నుమా రైల్వేబ్రిడ్జిని కూడా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో క్రీడా స్టేడియంలను అభివృద్ధి పర్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. చార్మినార్ ఎమ్మెల్యే అహ్మాద్ పాషాఖాద్రీ,బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ,రవాణ, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, ఆర్టీసీ ఎం.డి.జి.వి.రమణారావు, ఈడీ ఎ.పురుషోత్తం నాయక్, ఆర్.ఎం. వెంకటేశ్వర్ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో జోష్....
మొఘల్‌పురాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్‌తో పలు క్రీడలు ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. వీరు బాస్కెట్‌బాల్, బాడ్మింటన్, క్యారమ్స్, క్రికెట్ ఆడి సందడి చేశారు.
పాతబస్తీపై హమీల వర్షం
పాతబస్తీ పర్యటన సందర్భంగా కేటీఆర్ పలు హామీలు గుప్పించారు. ఫలక్‌నుమా రైల్వేబ్రిడ్జి విస్తరణలో భాగంగా రూ.27 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో అదనపు బ్రిడ్జిని నిర్మిస్తామని ప్రకటించారు. ముర్గీచౌక్‌లో క్లాక్ టవర్ మరమ్మతులకు రూ.5 కోట్లు, చార్‌కమాన్ మరమ్మతుల కోసం రూ.1.77 కోట్ల నిధులు వెచ్చిస్తామని, త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి మేరకు ఫలక్‌నుమా పీటీవో ప్రాంతంలోని 10 ఎకరాల పోలీస్ స్థల విషయమై ఇంజనీరింగ్ అధికారులు, హోం మంత్రితో మాట్లాడి.....అభ్యంతరాలు లేకుంటే ఆ స్థలాన్ని రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు.