బుధవారం ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌కు లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : పట్టణ మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు గుర్తింపుగా లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం సంతోషకరమని రాష్ట్ర మంత్రి రామారావు అన్నారు. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషికి, పాలనాపరంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చొరవకుæ గుర్తింపుగా బిజినెస్ వరల్డ్ సంస్థ ప్రకటించిన అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు. బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్.. కేటీఆర్‌కు అవార్డును అందజేశారు. అలాగే ఉత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పేదలకు పక్కా ఇళ్లు, హరితహారం వంటి కార్యక్రమాల అమలుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అవార్డుల ప్రదానోత్సవంలో ఎంపీలు కవిత, కొండా విశ్వేశ్వర రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామచంద్ర తెజావత్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించగలిగామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. సోలార్ ద్వారా 3 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కూడా అదేనని చెప్పారు. పౌరులకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, ఆ దిశగా ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు.
విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళీకరించండి..
దేశంలో అత్యధిక వృద్ధిరేటుతో ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపనకు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున సంస్థలు ముందుకొస్తున్నాయని, అయితే దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ విదేశీ పెట్టుబడుల నిబంధనలను సర ళీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మంత్రి కేటీఆర్ వివరించారు. జైట్లీని బుధవారం పార్లమెంట్‌లో కలుసుకున్న కేటీఆర్ విదేశీ పెట్టుబడుల స్థాపనకు ఉన్న నియమావళిని సరళీకరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంత్రి కేటీఆర్ లేవనెత్తిన అంశాలతో ఏకీభవించిన జైట్లీ ఆ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే విదేశీ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రుణం పొందే వెసులుబాటును కల్పించాలని కేటీఆర్ కోరారు.
అనంతరం కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభును కలసి రాష్ట్రంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన తరువాత ఈ సంస్థ ఏపీకి దక్కిందని, తెలంగాణలో కూడా ఒక సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌ను ఎంపీ కవిత మరోసారి కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. తెలంగాణ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై త్వరలో ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పుడు రాష్ట్ర అధికారులు కూడా హాజరుకావాల్సిందిగా సురేశ్ ప్రభు కోరారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమైన కేటీఆర్.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ నిర్వహణకు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను తరువాతి దశకు తీసుకెళ్లడంపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment