ఉరుములు మెరుపులు | Storm Devastation in distic | Sakshi
Sakshi News home page

ఉరుములు మెరుపులు

Published Sat, May 21 2016 4:57 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

ఉరుములు మెరుపులు

ఉరుములు మెరుపులు

స్తంభించిన పౌరజీవనం
భెల్‌లో జనం బెంబేలు
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఎగిరిపడ్డ  పైకప్పులు
అంధకారంలో గ్రామాలు

గాలివాన.. మెతుకుసీమను అతలాకుతలం చేసింది. పెను బీభత్సాన్ని సృష్టించింది. వేర్వేరు చోట్ల పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు.  బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నారాయణఖేడ్, నర్సాపూర్, దుబ్బాక, పటాన్‌చెరు నియోజకవర్గాలో భారీ నష్టం జరిగింది. గాలివానకు భెల్ పట్టణం స్తంభించింది. వందలాది చెట్లు విరిగిపడ్డాయి. ఒకవైపు చెట్లు, మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతుంటే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యుతు సరాఫరా నిలిచిపోయింది. పుల్‌కల్ మండలం బస్వాపూర్‌కి చెందిన గొల్ల దుర్గయ్య (25), సిద్దిపేట మండలం బక్రిచెప్యాలకు చెందిన కుర్మ సత్తయ్య, సత్తవ్వల కుమార్తె కుర్మ సౌజన్య (13) పిడుగుపాటుకు బలయ్యారు.

కొత్త పెళ్లికొడుకును మింగిన పిడుగు
పుల్‌కల్: పిడుగుపాటుకు నవ వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బస్వాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బస్వాపూర్‌కు చెందిన గొల్ల దుర్గయ్య(25) ఎప్పటిలాగే గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోకూడిన వర్షం వచ్చింది. దుర్గయ్య వెంటనే వేప చెట్టు కిందకు వెళ్లే ప్రయత్నం చేయగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గయ్యకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. తమ ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కిష్టయ్య, ఎల్లమ్మలు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సిద్దిపేటలో గాలివాన బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపోయాయి. చెట్లు విరగ్గా, గోడలు కూలాయి. కరీంనగర్ రోడ్డులో దుర్గా దాబా నేలమట్టమైంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌తోపాటు పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు. రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద విద్యుత్ వైర్లు తెగిపోయాయి.

శివ్వంపేట మండలం శివ్వంపేట, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్, పిల్లుట్ల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. కొత్తపేటలో ధనారెడ్డికి చెందిన పౌల్ట్రీఫారం ధ్వంసమైంది. ఏడువేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.15 లక్షల నష్టం జరిగింది.

జిన్నారంలో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. మాధవరం, ఊట్ల, జిన్నారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి.

కల్హేర్, మార్డి, బీబీపేట, కృష్ణాపూర్ తదితర చోట్ల గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పౌల్ట్రీఫారాల రేకులు ఎగిరిపడ్డాయి.

పటాన్‌చెరుతోపాటు రామచంద్రాపురం, భెల్‌లో భారీ నష్టం జరిగింది. భారీ ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భెల్ టౌన్‌షిప్ అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి పదిరోజులైనా పడుతుందని కార్మికులు అంటున్నారు.

సంగారెడ్డిలో మోస్తరు వర్షం కురిసింది.

మెదక్ పట్టణంలో వర్షం ఊరించి ఉసూరుమన్పించింది. కారు మబ్బులు కమ్ముకున్నా, ఉరిమినా వర్షం కురవకపోవడంతో రైతులు నిరాశ చెందారు.

 గాలివానతో లబోదిబో...
హత్నూర: మండలంలోని మూడు గ్రామాలు, నాలుగు తండాల్లో గాలివాన విధ్వంసాన్ని సృష్టించింది. నాగారం, కొడిప్యాక, కొత్తగూడెం గ్రామాలతోపాటు చింతల్‌చెరువు పంచాయతీలోని గోపాల్ తండా, కిషన్‌తండా, కిమ్యాతండా, ఎల్లమ్మ గూడెం పంచాయతీ పరిధిలోని రేన్ల గూడెం అతలాకుతలమయ్యాయి. దాదాపు 80 వరకు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు దెబ్బతిన్న కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. దాదాపు వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌సరఫరా లేకపోవడంతో సదరు గ్రామాలు, తండాలు అంధకారంలో ఉండిపోయాయి. పెద్ద ఎత్తున చెట్లు కూలాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోపాల్ గిరిజన తండాలో లకావత్ శ్రీను పూరిల్లు కూలడంతో కుటుంబీకులు శిథిలా నుంచి బయటకు పరుగులు తీశారు.

కిషన్ తండాకు చెందిన రోహుల నాయక్ ఇంటిపైకప్పు రేకులతోపాటు గోడలు కూలి ఇంట్లో ఉన్నవారిపై పడడంతో గాయాలయ్యాయి.  గోపాల్ తండాకు చెందిన పాండు, దేవుల, డాక్య, సుభాష్, కిషన్, నర్సింగ్, గేమ్‌సింగ్, గోపాల్‌నాయక్, నాన్య, రమేష్‌నాయక్‌ల ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కిషన్‌తండాకు చెందిన సామ్య, బూల్యాతోపాటు మరోపదిమంది ఇళ్లు కూలిపోయాయి. కిమ్యా తండాకు చెందిన నర్సింగ్, శంకర్, కిమ్యానాయక్, రాజునాయక్‌తోపాటు పలువురి ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. మూడు తండాలలో గిరిజనులు ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులు సామగ్రితో బయటకు వచ్చేశారు.

చెట్లు, కరెంటు స్తంభాలు విరిగి ఇళ్లు, బైక్‌లపై పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొత్తగూడెం, నాగారం, కొడిపాకలో సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతోపాటు 60ళ్ల వరకు రేకులు, పెంకుటిళ్ళ పైకప్పులు ధ్వంసమయ్యాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్దపెద్ద చెట్లు వడ్డేపల్లి, నాగారం, కొత్తగూడెం రహదారులపై అడ్డంగా పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.గిరిజన తండాలో పైకప్పు రేకులు కూలడంతో శారద, కమల, రాధమ్మ అనే మహిళలకు గాయాలయ్యాయి. ఆయా గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పర్యటించనున్నారు.

పసిగుడ్డుతో వీధిన పడ్డ బాలింత
నర్సాపూర్ రూరల్: గూడెంగడ్డకు చెందిన స్వరూప అనే మహిళ పూరింట్లోకి నీరు చేరింది. దీంతో ఆమె కూతురైన బాలింత నాగమణి పసిగుడ్డుతోపాటు సామాన్లతో బయటకు వచ్చింది. ఆశ్రయం కోసం ఎదురు చూస్తోంది.

 పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతి
నత్నాయపల్లిలో పిడుగుపాటుకు నీలి లక్ష్మీనారాయణకు చెందిన నాలుగు మేకలు మృత్యువాత పడ్డాయి. అడవిలో మేకలు మేపుకొని వస్తుండగా వర్షం పడుతుండడంతో మేకల మందను ఓ చెట్టుకింద నిలిపాడు. పిడుగు శబ్దం రాగానే లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరుగు తీయగా నాలుగు మేకలు అక్కడికక్కడే మృతిచెందగా మరో నాలుగు మేకల పరిస్థితి విషమంగా ఉంది. లింగాపూర్‌లో హన్మంత్‌కు చెందిన పౌల్ట్రీఫారం దెబ్బతింది. దాదాపు 5వేల కోడిపిల్లలు చనిపోగా రూ.3లక్షల వరకు నష్టం జరిగింది.

బాలికను బలిగొన్న పిడుగు
సిద్దిపేట జోన్: పిడుగు పాటుకు ఓ బాలిక మృతి చెందింది. వెంట ఉన్న కుక్క పిల్ల సైతం మాడిమసైంది. ఈ ఘటన మండలంలోని బక్రిచెప్యాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మ సత్త య్య, సత్తవ్వ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. శుక్రవారం పొలంలో ఎరువు చల్లేందుకు తల్లిదండ్రులతో కలిసి అన్నాచెల్లెలు వెళ్లారు. సాయంత్రం వేళ వాతావరణంలో మార్పును గమనించిన సౌజన్య(13) ఇంటికి వెళ్దామని అన్నయ్యతో చెప్పింది. తాను పశువులను కట్టేసి వస్తానని చెప్పడంతో సౌజన్య చెరువు వెంట ఇంటిముఖం పట్టింది. అప్పటికే ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. తనతోపాటు వచ్చిన కుక్కపిల్లతో కలిసి చెరువు గట్టున ఉన్న తుమ్మచెట్టు కిందకు చేరింది. పిడుగు పడడంతో సౌజన్య అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుక్కపిల్ల సైతం మాడి మసైంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

 తరలివచ్చిన మంత్రి...
సిద్దిపేటలో రోజంతా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌కు బయలుదేరారు. పిడుగుపాటు తో బాలిక మృతి చెందిన విషయం తెలిసి వెంటనే వెనుదిరి గారు. బక్రిచెప్యాలకు వెళ్లి మృతురాలి కుటుం బీకులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వారి భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement