గాలివాన బీభత్సం
సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం
సిద్దిపేట/ యాదాద్రి: సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో మంగళవారం రాత్రి.. బుధవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన రైతులను కడగండ్ల పాలు చేసింది. సిద్దిపేట జిల్లాలోని కొండపాక, తొగుట, కొమురవెల్లి, గజ్వేల్, హుస్నాబాద్, అక్కన్నపేట మండలా లలో వందలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. వరితోపాటు, కూరగాయల తోట లు భారీగా దెబ్బతిన్నాయి. గంటపాటు మేడి కాయల పరిమాణంలో వడగండ్లు పడ్డాయని రైతులు తెలిపారు. పొట్టదశలోని చేలపై రాళ్లు పడటంతో పొట్టలు పగిలిపోయి తాలుగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో రైతు కు 50 వేల వరకు నష్టం జరిగిందంటూ గుండెలవిసేలా విలపించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
హుస్నాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం వీచిన గాలి దుమారంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో కురిసిన వర్షానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రధానంగా కోతకు వచ్చిన వరికంకులు రాలిపోయాయి. 500 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో మామిడితోటలు దెబ్బతిన్నాయి. పిడుగుపడి వలిగొండ మండలం రెడ్లరేపాకలో 5 గొర్రెలు, అడ్డగూడూరులో 2 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భువనగిరి నూతన మార్కెట్‌లో వర్షపు వరద నీటికి రైతులు అమ్మకానికి తెచ్చిన సుమారు 500 బస్తాల ధాన్యం తడిసిపోయింది. యాదగిరి కొండపై ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. ప్రసాద విక్రయశాల, శాశ్వత కల్యాణం, చలువ పందిళ్ల పైకప్పులు లేచిపోయాయి. దేవస్థానం ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి గాయాలపాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు.