
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో వరద ముప్పు పొంచి ఉందా? తుపాను రూపంలో ఆ ముప్పు ముంచుకు రానుందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వాతావరణ సంస్థలు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న 24 గంటల్లో (సోమవారం నాటికి) మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 19 నాటికి ఉత్తర కోస్తాంధ్ర – ఒడిశాల మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి వెల్లడించింది. మరోవైపు రాయలసీమపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
అదే సమయంలో రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడతాయని, భారీ ఈదురుగాలులకు ఆవకాశం ఉందని వివరించింది. గడచిన 24 గంటల్లో తాడిమర్రిలో 8, బత్తలపల్లి, ధర్మవరంలలో 8, కంబదూరు, కూనవరం, వరరామచంద్రపురంలలో 7, రామగిరి, వేలేరుపాడు, చింతపల్లి, రామగిరిలోల 5, మడకసిరలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.
వరద ముప్పు పొంచి ఉందా?
ఈశాన్య రుతుపవనాల సీజను మొదలయ్యాక అక్టోబర్ – డిసెంబర్ మధ్య మూడు తుపాన్లు సంభవించనున్నాయంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తుపాన్ల రాకపై ఇప్పటికే ఇస్రో ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు, అంతర్జాతీయ ప్రైవేట్ వాతావరణ సంస్థ ఆక్యు వెదర్ సీనియర్ మెటిరియాలజిస్ట్ జాసన్ నికోల్స్ చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశా తీరప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అందువల్ల వరదలు సంభవించే ప్రమాదం ఉందని సూచించారు. ఇదిలా ఉండగా చైనా సముద్రంలో ప్రస్తుతం ‘ఖానూన్’ అనే పెనుతుపాను కొనసాగుతోంది. ఇది రెండ్రోజుల్లో బలహీన పడే అవకాశం ఉండటంతో ఇక్కడ 16న అల్పపీడనం ఏర్పడి 19 నాటికి వాయుగుండంగా మారవచ్చని ఐఎండి పేర్కొంది.