ఎనిమిది పదులు దాటిన ఆ ముదుసలికి కడుపులో ఆకలి బాధలకంటే కన్నపేగు మిగిల్చిన ఆవేదనలే ఎక్కువయ్యాయి. ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. రెండెకరాల పొలం, ఇంటి స్థలం.. 20 ఏళ్ల క్రితం ఇంటాయన తనకు మిగిల్చిన ఆస్తులు. కన్న బిడ్డలకు అమ్మకంటే ఆస్తులపై మమకారం పెరిగింది. తల్లిని కర్మకాండల భవనం పాలు చేసింది. ఇరవై రోజులుగా తినీతినక కట్టెగా మారిన ఆ శరీరం..గురువారం తాడేపల్లి వద్ద కాలువలో కాలుజారి పడింది. ఇప్పటి వరకు జీవచ్ఛవంగా బతుకీడుస్తున్న ఆమె నిర్జీవంగా మారింది. తాడేపల్లి పోలీసుల చొరవతో చివరకు మృతదేహంగానైనా ఆమె బిడ్డల చెంతకు చేరింది.
సాక్షి, తాడేపల్లి : ఆ బామ్మ పేరు రాఘవమ్మ. వయస్సు 85 ఏళ్లు. కట్టుకున్న భర్త 20 ఏళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త చనిపోయాక ఆమెకున్న ఆస్తిని వాటాలేసుకుని పంచుకున్నారు తప్పా ఆమె బాగోగులు ఎవరూ ఆలోచించలేదు. చివరకు ఓ కర్మకాండ భవనంలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పొరపాటున కాలుజారి కాలువలో పడి గురువారం మృతి చెందింది. సేకరించిన వివరాల ప్రకారం.. కుంచనపల్లి గ్రామానికి చెందిన దాసిశెట్టి వెంకయ్య, రాఘవమ్మ ఇద్దరూ భార్యాభర్తలు. 20 ఏళ్ల కిందట వెంకయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
అనంతరం రాఘవమ్మ తనకున్న రెండు ఎకరాల పొలాన్ని, ఇళ్ల స్థలాన్ని కూతుర్లు, కొడుకుకి పంచింది. 40 ఏళ్ల కిందట కుమారుడైన సాంబశివరావు ఇల్లు వదిలిపెట్టి విజయవాడ చిట్టినగర్‌లో నివాసముంటున్నాడు. దీంతో రాఘవమ్మ కూతుళ్ల దగ్గరే జీవిస్తోంది. కొంతకాలం కిందట కుంచనపల్లిలో ఉండే మొదటి కూతురు వెంకాయమ్మ , రాణీగారితోటలో ఉండే రెండో కూతురు వెంకాయమ్మతో విభేదాలు వచ్చాయి. దీంతో తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్టపై ఉండే చిన్నకూతురు సుబ్బలక్ష్మి దగ్గర నివాసముంటోంది. ‘అస్తమానం మా వద్దే ఎందుకు ఉంటున్నావూ...కొడుకు దగ్గరకు వెళ్లొచ్చు గదా’ అని ఆమె అనడంతో అనడంతో రాఘవమ్మ మనస్తాపం చెంది గత 20 రోజుల నుంచి రాఘవమ్మ తాడేపల్లి బకింగ్ హామ్ కెనాల్ పక్కనే ఉన్న కర్మకాండ భవనంలో నివాసముంటోంది.
అక్కడకి వచ్చిన వారు పెట్టిన తిండి తిని అక్కడే జీవనం కొనసాగిస్తోంది. రోజు ఉదయం స్నానం చేసి అక్కడే ఉన్న వినాయకుడి గుడిలో పూజలు నిర్వహిస్తుందని స్థానికులు చెబుతున్నారు. గురువారం కూడా అదే విధంగా నిద్రలేచి కాలువలో దిగి పొరపాటున కాలు జారి కొట్టుకుపోయింది. ఆమె చీర ముళ్ల పొదలకు పట్టుకోవడంతో మృతదేహం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారించగా రాఘవమ్మ కుటుంబ సభ్యులున్నారని నిర్ధారించారు.
మృతదేహాన్ని బయటికి తీసిన తరువాత కూడా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బంధువుల వివరాలు సేకరించారు. రాఘవమ్మ కొడుకు విజయవాడలో ఉంటాడని తెలుసుకుని అతనికి సమాచారం ఇచ్చారు. అతడు రావడానికి సుముఖత చూపకపోవడంతో పోలీసులు మానవతాన్ని చాటుకుని ‘మీరు చేస్తారా.. మమ్ముల్ని అంత్యక్రియలు చేయమంటారా ? ’ అనడంతో ఎట్టకేలకు కొడుకు తాడేపల్లి స్టేషన్‌కు వచ్చాడు. అతడి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి వృద్ధురాలి మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment